సీమ కరువుపై చులకన తగదు: గడికోట | Sakshi
Sakshi News home page

సీమ కరువుపై చులకన తగదు: గడికోట

Published Sat, Dec 20 2014 2:04 AM

సీమ కరువుపై చులకన తగదు: గడికోట

సాక్షి, హైదరాబాద్: రాయలసీమలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, కరువును అధిగమించే చర్యల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు చాలా తీవ్రంగా ఉం దని, ఈ సమస్యపై చర్చించాలని కోరితే పాలకపక్షం చులకనగా వ్యవహరించడం భావ్యం కాదని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు, రైతన్నల ఆత్మహత్యలపై అసెంబ్లీ లో సంతాపం ప్రకటించాలని తమ పార్టీ కోరితే ఆ సంప్రదాయం లేదని, ఆనవాయితీ కాదని చంద్రబాబు చెప్పడం శోచనీయమన్నారు.
 
  ఆర్నెల్ల కాలంలో ఆకలితో 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, పట్టీపట్టనట్లు వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లిందని దుయ్యబట్టారు. శ్రీశైలం డ్యామ్ నుంచి 43 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు పోతుండటంతో గత ఏడాది కాలంగా రాయలసీమ ఎడారిగా మారుతోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 541 మండలాలు దుర్భిక్షంతో అల్లాడుతున్నాయంటూ టీడీపీ అధికార గెజిట్ అయిన ‘ఈనాడు’ రాసిన కథనాన్ని శ్రీకాంత్‌రెడ్డి విలేకరులకు చూపించారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా కరువు తాండవిస్తున్నా చంద్రబాబు ఇంతవరకు ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదన్నారు. కరువు ప్రాంతాల విషయంలో బాబు పూర్తి నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపై చర్చించేందుకు వీలుగా అసెంబ్లీని 15 రోజుల పాటు నిర్వహించాలని తమ పార్టీ కోరితే.. ‘మాకు వేరే పనులున్నాయి..’ అని బీఏసీలో సీఎం చెప్పడం ప్రజా సమస్యలపై వారి చిత్తశుద్ధిని తేట తెల్లం చేస్తోందని విమర్శించారు.
 
 కేవలం నాలుగు రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోకుండా చంద్రబాబు టూర్లు వెళ్లడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు ‘నీళ్లో రామచంద్రా.. దాహమో రామచంద్రా..’ అని గొంతెత్తి వేడుకుంటున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని, ప్రజలు హుద్ హుద్ తుపాను విషయంలో స్పందించిన విధంగానే రాయలసీమ కరువుపై కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement