ఆట.. అడ్డదారి! | Sakshi
Sakshi News home page

ఆట.. అడ్డదారి!

Published Sun, Jul 26 2015 3:25 AM

ఆట.. అడ్డదారి!

సాక్షి, కడప/ కడప స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందేందుకు కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. రాజకీయంగా కొందరు, పైరవీలు చేస్తూ మరికొందరు సీటు కోసం చక్రం తిప్పుతున్నారు. ఏకంగా కేంద్ర మంత్రుల నుంచి ఫోన్లు వస్తుంటే ఒత్తిడి భరించలేక ఓ అధికారి నాలుగు రోజుల పాటు సెల్‌ఫోన్ ఆఫ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎలాగోలా సీటు దక్కించుకుంటే ఇంటర్ వరకు అన్ని ఖర్చులు పాఠశాల యాజమాన్యమే భరించడంతో పాటు క్రీడల్లో మంచి భవిష్యత్ ఉంటుందని పలువురు భావిస్తుండటం వల్లే డిమాండ్ ఏర్పడింది.

 సెలక్షన్స్‌పై ఉత్కంఠ
 క్రీడా పాఠశాలకు ఎంపికైతే క్రీడల్లో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పడినట్లే. కడప నగరంలో ఉన్న వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 40 సీట్లు (బాలురు20, బాలికలు20) ఉంటాయి. తొలుత మండల, ఆపై జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వారిలోంచి అర్హులైన వారిని ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప నగరంలోని వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో ఎంపిక చేస్తారు.

ఈ ఎంపికకు ఒక్కో జిల్లా నుంచి బాలికల విభాగంలో ఎనిమిది, బాలుర విభాగంలో ఎనిమిది.. మొత్తం 16 మంది హాజరు కానున్నారు. ఈ లెక్కన 13 జిల్లాల నుంచి 208 మంది బాలబాలికలు ఫైనల్ సెలక్షన్స్‌కు హాజరు కానున్నారు. వీరిలో ప్రతిభ కనపరిచిన 40 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారు. పోటీ ఎక్కువగా ఉండటంతో పలువురు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఓ కేంద్ర మంత్రి నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది.  

 ఎంపికలకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
 గతేడాది సెలక్షన్స్‌లో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ ఏడాది అత్యున్నత స్థాయి కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్‌గా శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, మెంబర్ కన్వీనర్‌గా క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి రుద్రమూర్తి యాదవ్, మెంబర్లుగా శాప్ ఎండీ రేఖారాణి, జిల్లా కలెక్టర్ కే.వి.రమణ, ఓఎస్‌డీ నాగరాజు, శాప్ డెరైక్టర్లు హనుమంతరావు, సత్తి గీత, రవీంద్రబాబు, డి.జయచంద్ర వ్యవహరిస్తారు. క్రీడా పాఠశాల కోచ్‌లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కోచ్‌లను ఈ ఎంపిక ప్రక్రియకు నియమించారు.
 
 నిష్పక్షపాతంగా ఎంపికలు నిర్వహిస్తాం
 మాకు ఏ రాజకీయ నాయకుడు, ప్రజా ప్రతినిధి నుంచి ఎటువంటి ఒత్తిడి రాలేదు. క్రీడా పాఠశాల ఎంపికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం. శాప్ చైర్మన్, సభ్యులు, ఎండీ, జిల్లా కలెక్టర్ తదితరులతో కూడిన అత్యున్నత కమిటీ ఈ ఎంపికలను పర్యవేక్షిస్తుంది. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు వదంతులు, దళారులను నమ్మవద్దు. ఈ నెల 27న రాయలసీమ జిల్లాల క్రీడాకారులకు, 28న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, 29న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల క్రీడాకారులకు ఫైనల్ సెలక్షన్స్ పోటీలు నిర్వహిస్తున్నాం.
 - రుద్రమూర్తి యాదవ్, క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి, కడప

Advertisement
Advertisement