ఆటలు సాగవని..! | Sakshi
Sakshi News home page

ఆటలు సాగవని..!

Published Sun, Sep 1 2013 3:49 AM

Games do not stretch ..!

అసలే ఐఏఎస్.. ఆపై యువరక్తం.. తొలిపోస్టింగ్.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు పాలనలో తమదైన ముద్రకోసం తపించడం సహజం. ఈ క్రమంలో రాజకీయ నాయకుల ఆటలు సాగడం అనుమానమే. ఇదే భయంతో పలువురు నేతలు జగిత్యాల డివిజన్‌కు సబ్‌కలెక్టర్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత ఆర్డీవోనే కొనసాగించాలని, లేనిపక్షంలో ఆయనను వేరే డివిజన్‌కు పంపించి.. మరో ఆర్డీవోను ఇక్కడ నియమించాలని కోరుతున్నారు.
 
 జగిత్యాల, న్యూస్‌లైన్ : కొత్తగా ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న బాలాజీరావును జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఆయన ఇప్పటివరకు జగిత్యాలకు రాలేదు. దీంతో ఆర్డీవో హన్మంతరావు బదిలీ నిలుపుదలకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారాన్ని అందరూ నమ్ముతున్నారు. ఆర్డీవో బదిలీని రద్దు చేయించేందుకు ఆయన సన్నిహితులు కొందరు మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
 
 మంత్రి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో అంతా ఫోన్ల ద్వారా నడిపిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఆర్డీవో బదిలీని రద్దు చేయాలని అధికార పార్టీ నేతల నుంచే అధికంగా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారిని నియమిస్తే తమ మాటలు వింటాడో.. లేదోనని వారు మదనపడుతున్నారు. దీనికితోడు త్వరలోనే మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికలతోపాటు సంవత్సరంలో సాధారణ ఎన్నికలు రానున్నాయి.
 
 ఈ నేపథ్యంలో ఇక్కడ ఐఏఎస్ అధికారి ఉంటే ఎన్నికల్లో తప్పుడు పనులు చేయలేమనే బెంగ రాజకీయ నాయకులకు పట్టుకుంది. దీంతో బాలాజీరావు రాకను అడ్డుకునేందుకు శథవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది సాధ్యం కాకుంటే జిల్లాలోని మరో డివిజన్‌లో రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఆర్డీవోను జగిత్యాలలో నియమించి.. ఇక్కడి ఆర్డీవోను ఖాళీ స్థానానికి పంపించాలని ప్రతిపాదిస్తున్నారు. మంథని ఆర్డీవోను జగిత్యాలకు, జగిత్యాల ఆర్డీవోను మంథనికి బదిలీ చేయాలని ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలు సూచిస్తున్నారు. జగిత్యాల డివిజన్‌లో పీడీఎస్ సరుకుల అక్రమ రవాణాతోపాటు అవినీతిపైన ఐఏఎస్ వస్తే కొరడా ఝులిపిస్తాడనే భయంతో చీకటి వ్యాపారులు సైతం ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
 
 జగిత్యాలకు ఐఏఎస్ అధికారి వచ్చినా ఫర్వాలేదు కానీ.. రెండేళ్లుగా జగిత్యాల డివిజన్‌లో పలు రకాల పనులు నిర్వహించి ఉత్తమ అవార్డులు అందుకున్న హన్మంతరావుకు పోస్టింగ్ ఇవ్వకపోవడం సబబు కాదని మరికొందరు వాదిస్తున్నారు. వీరు ఆయన బదిలీ రద్దుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలాజీరావు రాక ఆలస్యమవుతుండడంతో ఆర్డీవోగా హన్మంతరావే కొనసాగుతారనే  ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగిత్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే 23 మంది ఐఏఎస్‌లు పనిచేశారు. 10 మంది అసిస్టెంట్లు కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వహించగా, 19 మంది మాత్రమే ఆర్డీవోలుగా పనిచేశారు.

Advertisement
Advertisement