జెట్ స్పీడ్ ! | Sakshi
Sakshi News home page

జెట్ స్పీడ్ !

Published Wed, Nov 12 2014 12:38 AM

జెట్ స్పీడ్ !

గన్నవరం విమానాశ్రయ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన భూములు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో అభివృద్ధి అడుగు ముందుకు పడుతోంది. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సన్నాహాలు చేస్తోంది. అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణంతో పాటు బోయింగ్, కార్గో విమానాలు కూడా రాకపోకలు సాగించేలా రన్‌వే విస్తరించనున్నారు.
 
గన్నవరం : విజయవాడ సమీపంలో రాజధాని ప్రకటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత పెరిగింది. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్‌తో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాన్ని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో విమానాశ్రయ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

దీంతో విమానాశ్రయ అభివృద్ధికి ఏఏఐ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఉన్న సుమారు 500 ఎకరాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న 490 ఎకరాలు అప్పగిస్తే అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు పేర్కొంటున్నారు. భూసేకరణ పూర్తయిన మూడేళ్లలోనే ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు ఏఏఐ కూడా సిద్ధంగా ఉంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో...
విమానాశ్రయ విస్తరణలో భాగంగా సుమారు 700 మంది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు కూర్చునేందుగా వీలుగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మించడంతో పాటు భారీ బోయింగ్ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న 9,500 అడుగుల రన్‌వేను సుమారు 12,500 అడుగుల వరకు విస్తరించనున్నట్లు ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజ్‌కిషోర్ ‘సాక్షి’కి తెలిపారు. కార్గో సర్వీసులు నడిపేందుకు అనువైన వసతులతో పాటు అప్రాన్, కార్ పార్కింగ్, ఏటీసీ టవర్ తదితర నూతన హంగులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement