రుసరుసల గంట

21 Nov, 2018 09:26 IST|Sakshi
మంత్రి గంటా , ఉదయకుమార్‌

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిపై విరుచుకుపడిన మంత్రి

చెప్పకుండా ఉత్సవాల ఏర్పాట్లు చేశారని ఆగ్రహం

ఇంటికి పిలిపించి మరీ తీవ్రంగా చీవాట్లు

కొద్దినెలల క్రితం ఆనందపురం తహసీల్దార్‌పైనా విరుచుకుపడిన గంటా

తీవ్ర మనస్తాపంతో దీర్ఘకాల సెలవుపై వెళ్లిపోయిన ఉదయకుమార్‌

‘నాకు చెప్పకుండానే ఉత్సవాలు చేసేస్తారా?.. అంతా మీ ఇష్టమేనా??.. నాకు కన్పించొద్దు.. సెలవు పెట్టి వెళ్లిపోండి’.. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిపై మంత్రి గంటావారి హూంకరింపులివి..ఉత్త పుణ్యానికే.. ఇంటికి పిలిపించి మరీ ఒంటికాలిపై లేచిన అమాత్యుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కార్యదర్శి ఉదయకుమార్‌ దీర్ఘకాల సెలవుపై వెళ్లిపోయారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈ నెల 15న.. గ్రంథాలయ వారోత్సవాల రెండోరోజే చోటుచేసుకుంది. ప్రతి ఏటా జరిగే రీతిలోనే గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాల షెడ్యూల్‌ రూపొందించడమే ఆయన చేసిన తప్పట!..కొద్ది నెలల క్రితమే ఆనందపురం తహసీల్దార్‌ ఈశ్వరరావును ఇదేరీతిలో ఇంటికి పిలిపించిమరీ వాయించేసిన మంత్రి.. ఆనక ఆత్మీయ సమావేశం పేరుతో రెవెన్యూ అధికారులతో భేటీ అయిచల్లబర్చారు.మళ్లీ ఇప్పుడు గ్రంథాలయ కార్యదర్శిపై విరుచుకుపడటం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.ఆయనపై మంత్రి అలా విరుచుకపడటానికి వేరే కారణముందన్న వాదన కూడా వినిపిస్తోంది. గంటాకు చెందిన ప్రత్యూష సంస్థకు గ్రంథాలయ సంస్థ స్థలం కేటాయింపు వివాదంలో కార్యదర్శి ఉదయకుమార్‌ గ్రంథాలయ సంస్థకు అనుకూలంగా నివేదిక ఇవ్వడమే.. ఆయన రుసరుసల వెనుక ఆంతర్యమని అంటున్నారు.

సాక్షి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు.. పైకి సౌమ్యంగానే కన్పిస్తారు. నవ్వుతూనే అందర్నీ పలకరిస్తుంటారు. కానీ తనకు అనుకూలంగా పని చేయకపోతే మాత్రం గంటకొట్టి మరీ వా యించేస్తారు. నిన్నగాక మొన్న ఆనందపురం తహసీల్దార్‌ ఈశ్వరరావును ఇంటికి పిలిపించుకు ని నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఆనక నాలుక కరుచుకుని కాళ్లబేరానికి వెళ్లారు. ఆత్మీ య సదస్సు పెట్టి అందర్ని ప్రాధేయపడ్డారు. ఈ ఘటన ఇంకా మరువకముందే మరో ఘటన చో టు చేసుకుంది. ఈసారి తన మంత్రిత్వశాఖ అధీ నంలో ఉండే జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి పై నిప్పులు చెరిగారు. గంటా ఆగ్రహానికి గురైన సదరు అధికారి గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న వేళ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అండగా నిలవాల్సిన సహచర అధికారులు, ఉద్యోగ సంఘాలు మిన్నకుండిపోయారు.

తమాషాగా ఉందా?
‘ఏం తమాషాగా ఉందా? నీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తావా? మంత్రిని.. నేను జిల్లాలో ఉండగా.. ఒక్క మాటైనా చెప్పక్కర్లేదా?అంతా మీ ఇష్టమేనా? నువ్వు నా ఎదుట కన్పించకు.. ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు. సెలవుపై వెళ్లిపో’అం టూ విద్యా శాఖకు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పువ్వాడ ఉదయకుమార్‌పై మం త్రి గంటా నిప్పులు చెరగడం చర్చనీయాంశమైం ది. గంటాకు ఎదురుచెప్పలేక ఆ కార్యదర్శి ఈ నెల 15వ తేదీ నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సమయంలో పర్యక్షించాల్సిన సెలవు పెట్టేయడంతో వారోత్సవాల వైభవం కనిపించలేదు.

అసలేం జరిగింది?
ఏటా నవంబర్‌ 14నుంచి 20వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. తొలిరోజు జాతీయ పతాకావిష్కరణతో పాటు వారం రోజు ల పాటు వివిధ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారు.ఈ ఏడాది అదే తరహా ఏర్పాట్లు చేశారు. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి మంత్రిగారికి కోపమొచ్చింది. ‘అత్తెరి నాకు చెప్పకుండా ఉత్సవాలా? అంటూ ఒంటికాలిమీద లేచారు. పీఏతో ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించారు. సెలవుపై వెళ్లిపో..నాకు కనిపించకు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పీఏతోనే డైరెక్టర్‌కు ఫోన్‌ చేసి ఉదయ్‌ను సెలవుపై పంపించాలంటూ హుకుం జారీ చేయించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఉదయ్‌ మొరపెట్టుకున్నా వారంతా మిన్నకుండిపోయారు. 

కన్నెత్తి చూడని గంటా..
కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో కూడా గంటా మంత్రిగా కొనసాగారు. ఆ రెండు ప్రభుత్వాల్లోనూ ఒకే శాఖకు ప్రాతినిధ్యం వహిం చారు. గడిచిన పదేళ్లుగా విద్యాశాఖకు ప్రాతి నిధ్యం వహిస్తున్నా ఏనాడైనా గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్నారా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. జిల్లా స్థాయి కా దు..రాష్ట్రస్థాయి వారోత్సవాల్లో కూడా పాల్గొన్న దాఖలాల్లేవు. కానీ ఇప్పుడెందుకిలా జరిగింది..ఆ అధికారినే లక్ష్యంగా చేసుకుని ఎందుకు నిప్పులు చెరిగారో ఆ శాఖ అధికారులు, సిబ్బం దికి కూడా అంతుచిక్కడం లేదని ఓ సీనియర్‌ లైబ్రేరియన్‌ ‘సాక్షి’ వద్ద వాపోయారు. పోనీ సదరు కార్యదర్శి ఏమైనా వివాదాస్పద అధికా రా? అంటే అదీ లేదు. నాలుగేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. 

స్థల వివాదమే కారణమా?
మంత్రి ఆగ్రహం వెనుక మరొక కోణం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రత్యూష కంపెనీకి గతంలో గ్రంథాలయ స్థలాన్ని  కేటాయించారు. ప్రజాసంఘాలు గగ్గోలు పెట్టడంతో ఆ లీజు రద్దయింది. ఆ వ్యవహారం వివాదస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ కమిటీని నియమించింది. కమిటీ కూడా గ్రంథాలయ సంస్థకు అనుకూలంగానే నివేదికిచ్చింది. ఆ వ్యవహారంలో తాను చెప్పినట్టు వ్యవహరించలేదన్న అక్కసుతోనే గంటా ఇలా మండిపడ్డారన్న వాదన తెరపైకి వచ్చింది. మంత్రికి వ్యతిరేకంగా నివేదిక తయారీ కావడంలో కార్యదర్శి పాత్ర కూడా ఉన్నట్టు వెలుగులోకి రావడంతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఈ నెల 28న గ్రంథాలయాల అసెంబ్లీ కమిటీ జిల్లాకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఎటువైపునకు దారితీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో కార్యదర్శి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం ఆ శాఖలో ప్రకంపనలకు దారితీస్తోంది.

మరిన్ని వార్తలు