ఆరిపోతున్న దీపం | Sakshi
Sakshi News home page

ఆరిపోతున్న దీపం

Published Mon, Jan 27 2014 2:30 AM

Gas Cash transfer scheme Aadhaar Bank accounts, new Connections

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వంట చెరకు వినియోగం తగ్గించడం, కాలుష్యం నుంచి పచ్చని పల్లెలను రక్షించడం అన్న లక్ష్యాలతో ప్రభుత్వం వెలిగించిన దీపం పథకం ఇప్పుడు అదే ప్రభుత్వ నిర్ణయాలతో ఆరిపోయే స్థితికి చేరుకుంది. నగదు బదిలీ పథకం పేరిట ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి దీపం లబ్ధిదారులకూ వర్తింపజేయడమే దీనికి కారణం. ఈ నిర్ణయంతో ఇప్పుడున్న దీపం లబ్ధిదారులకు తోడు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికీ గ్యాస్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ కష్టాలు పడలేక పలువురు లబ్ధిదారులు గ్యాస్ వినియోగాన్ని మానివేశారు.
 
 జిల్లాలో 1.3 లక్షల దీపం కనెక్షన్లు ఉండగా, ఇప్పటికే 47వేల మంది గ్యాస్‌ను విడిపించుకోవడం మానేశారు. కొందరు వలస వెళ్లడం, ఇంకొందరు ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఇతరులకు అమ్మేయడం వల్ల ఈ కనెక్షన్లు వినియోగంలో లేవు. తాజాగా మరో 30వేలకుపైగా వినియోగదారులు గ్యాస్ మానేసి కట్టెల పొయ్యిలనే వాడుతున్నారు. ఆధార్ అనుసంధానాన్ని నిర్బంధం చేయడమే దీనికి ప్రధాన కారణం. గ్రామాల్లో చాలా మందికి ఇంకా ఆధార్ కార్డులు అందలేదు. ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్న వారిలోనూ కొందరికి బ్యాంకు ఖాతాలు లేవు. ఆధార్ కార్డు పొందడం మాటెలా ఉన్నా నగదు బదిలీ కోసం బ్యాంకు ఖాతా తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారింది. 
 
 ఎక్కడో దూరప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి ఖాతా తెరవడం ఒక సమస్య కాగా,  ప్రతి నెలా అదే పనిగా బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు నిర్వహించడం గ్రామీణ ప్రజలకు కష్టసాధ్యం. బ్యాంకుకు వెళ్లాలంటే ఒకరోజు పని మానుకోవాలి. దాంతో ఆ రోజు కూలి కోల్పోవలసి వస్తుంది. దానికి తోడు బ్యాంకుకు వెళ్లి రావడానికి ఖర్చులు ఉంటాయి. ఇదంతా ఆర్థిక భారంతో కూడకున్న వ్యవహారమని గ్రామీణులు భావిస్తున్నారు. అలాగే ఇటీవలి వరకు రూ.415కే గ్యాస్ సిలెండర్ ఇచ్చేవారు. ఇప్పుడు దానికోసం ఏకంగా రూ.1300కు పైగా మదుపు పెట్టాల్సి వస్తోంది. సబ్సిడీ తర్వాత వచ్చినా ముందు అంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఆ తర్వాత కూడా సబ్సిడీ మొత్తం కోసం వ్యయ ప్రయాసలతో బ్యాంకుకు వెళ్లడానికి పేదలైన దీపం లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. 
 
 కొత్త దరఖాస్తుదారులకు అనుమానమే
 ఇదిలా ఉంటే దీపం కనెక్షన్‌కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 60వేల మందికి అవి మంజూరయ్యే పరిస్థితి లేదు. దరఖాస్తు చేసుకున్నవారంతా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డును జత చేస్తేనే కనెక్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించడమే దీనికి కారణం. కాగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు కూడా గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరు కూడా రూ.1300కే గ్యాస్ కొనుగోలు చేస్తుండగా, బిల్లులు మాత్రం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఆర్థిక భారం పెరుగుతోందని వాపోతున్నారు. అందువల్ల గ్యాస్‌ను పక్కన పెట్టి కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు.  
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement