జనాన్ని కొట్టి.. గ్యాస్‌ ఏజెన్సీలకు కట్టబెట్టి | Sakshi
Sakshi News home page

జనాన్ని కొట్టి.. గ్యాస్‌ ఏజెన్సీలకు కట్టబెట్టి

Published Mon, Oct 29 2018 7:17 AM

Gas Prices Hikes In Andhra Pradesh Dealers - Sakshi

విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కంటే వ్యాపారుల పైనే మక్కువ పెరిగింది. ప్రజలపై భారం పడుతున్నా పట్టించుకోకుండా గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లకు ఊరట కలిగించే విధంగా రవాణా చార్జీలు పెంచడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఒకేసారి వంతుకు వంతు పెంచడం గమనార్హం. దీంతో గ్యాస్‌ వినియోగదారులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నారు.

గ్యాస్‌ ఏజెన్సీల క్రియాశీలక పాత్ర..
వంట గ్యాస్‌ సిలెండర్లను చమురు సంస్థలు వినియోగదారులకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో గ్యాస్‌ ఏజెన్సీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి చమురు సంస్థలు నుంచి తెచ్చి వినియోగదారులకు ఇస్తున్నాయి. మొన్నటివరకు ఉన్న నిబంధనలు ఏజెన్సీలు తమ గోదాం నుంచి ఐదు కిలోమీటర్లు లోపల సరఫరా చేసేందుకు ఎలాంటి రుసుము వసూలు చేయరాదు. ఆరు కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్ల మధ్య వినియోగదారుడు నుంచి రూ.10 వసూలు చేయొచ్చు. 15 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ఉన్నా రూ.15 వసూలు చేయాలి. రవాణా చార్జీలు నిర్ణయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది.

ఒకేసారి డబుల్‌..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుండి గ్యాస్‌ సిలెండర్ల రవాణా చార్జీలను పెంచేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణ యం ప్రకారం ఐదు కిలోమీటర్ల లోపల సరఫరా చేసేందుకు ఎలాంటి రుసుం వసూలు చేయరా దు. ఆరు కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్లు మధ్య వినియోగదారుడు నుంచి ఇంతకుముందు వసూలు చేసిన రూ.10కి బదులు రూ.20 వసూలు చేయాలి. 15 కిలోమీటర్లు దాటి ఎంత దూరమైనా రూ.15 బదులు రూ.30 వసూలు చేయాలి. అంటే రెండు ఫేజుల్లో వసూలు చేసే రవాణా చార్జీ లను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నమాట.

వినియోగదారులపై భారం..
గ్యాస్‌ ఏజెన్సీలకు 6,15 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా నెలకు దాదాపు 3.20 లక్షలు గ్యాస్‌ బండలు వినియోగిస్తున్నారు. ఇందులో ఐదు కిలోమీటర్ల దూరం లోపల రవాణా చేసే సిలెండర్లు 80 వేలు వరకు ఉంటాయని అంచనా. 6 నుంచి 15 కిలోమీటర్ల మధ్య దూరం రవాణా చేసే సిలెండర్లు సుమారు 1.60 లక్షలు వరకు ఉంటాయి. 15 కిలోమీటర్ల దూరం దాటి రవాణా అవుతున్న సిలెండర్ల 80 వేల వరకు

ఉంటాయని ఒక లెక్క.
ఈ విధంగా చూస్తే 1.60 లక్షల వినియోగదారులపై నెలకు పెద్ద మొత్తంలో రూ.32 లక్షలు భారం పడినట్లే. మరో 80 వేల మంది వినియోగదారులపై నెలకు రూ.24 లక్షలు భారం పడుతుంది. వెరసి జిల్లాలో మొత్తం వినియోగదారులపై రూ.56 లక్షలు భారం పడినట్లువుతుంది. అయితే ఇందులో రూ.28 లక్షలు గతంలో భరిస్తున్నది కావడంతో కొత్తగా భారం పడినది మాత్రం రూ.28 లక్షలు. ఈ మొత్తం గ్యాస్‌ ఏజెన్సీలకు అదనంగా లాభం తెచ్చి పెడుతుంది. ప్రభుత్వం అకస్మాత్తుగా గ్యాస్‌ ఏజెన్సీలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్‌ చార్జీలు పెరగడంతో ఏజెన్సీలు రవాణా చార్జీలు పెంచాలని కోరి ఉండొచ్చు. అయితే గతం కంటే చమురు ధరలు డబుల్‌ కాలేదు. అలాంటప్పుడు రవాణా చార్జీలు పెంచడం ఏంటని వినియోగదారులు మండిపడుతున్నారు.

వినియోగదారులకు నష్టం..
గ్యాస్‌ రవాణా చార్జీలు పెంచడం దారుణం. ఒకేసారి రెండింతలు చేయడం మరీ దారుణం. ఇప్పటికే గ్యాస్‌ ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా చార్జీలు కొంతైనా తగ్గిస్తే వినియోగదారులకు మేలు జరుగుతుంది. కానీ పెంచి గ్యాస్‌ ఏజెన్సీలు పక్షాన ప్రభుత్వం నిలవడం బాధ కలిగిస్తుంది.– ఎస్‌.జగదీశ్వరి, సిరిపురం, గంట్యా

Advertisement

తప్పక చదవండి

Advertisement