ఓట్ల గాలానికి రూ.కోట్లు! | Sakshi
Sakshi News home page

ఓట్ల గాలానికి రూ.కోట్లు!

Published Sun, Mar 2 2014 5:02 AM

General elections Congress leaders 175 crore projects Groundbreakings

ఇన్నాళ్లూ ప్రజలు ఎక్కడున్నారో, ఏమైపోయారో పట్టించుకోకుండా మొద్దు నిద్రపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అధికారంతంలో అమాంతంగా జనాలు గుర్తుకొచ్చేశా రు. వారిపై వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారు. ఒక వైపు ఓటరు దేముళ్లను ప్రసన్నం చేసుకోవడం, మరోవైపు పదవు లు ఊడుతున్న వేళ కమీషన్ల రూపంలో అందినకాడికి నొక్కేయడమే ధ్యేయం గా రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎ న్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు. 
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : కాంగ్రెస్ నేతలు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టేశారు. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రపతి పాలన దృష్టిలో ఉంచుకుని ఆదరాబాదరాగా రూ. 175 కోట్ల విలువైన పనులకు రూపకల్పన చేశారు. ఎన్నికల తాయిలాలుగా 20 రోజులుగా చకచకా శంకుస్థాపనలు చేసేశారు. శనివారం ఒక్కరోజే కోట్లాది రూపాయల పనులకు కొబ్బరికాయ కొట్టారు.  ఆదివారం మరికొన్ని పనులకు శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. కానీ ఈలోగే  రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. ఇదిలా ఉండగా శంకుస్థాపన చేసిన పనులకు సాంకేతిక అనుమతులు లేవని తెలుస్తోంది. అదే జరిగితే భవిష్యత్‌లో పనులు రద్దు కాక తప్పదు. 
 
 ఎన్నికల మమకారం
 ప్రగతి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలంటూ సంవత్సరాల తరబడి ప్రజలు విన్నవించుకుంటున్నా పట్టిం చుకోని ప్రజాప్రతినిధులు నేడు అడక్కుండానే మమకారం చూపించారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముహూర్తం ముంచుకురావడంతో కాంగ్రెస్ నేతలు జోరు పెంచారు. రాష్ట్ర విభజనతో పోయిన ప్రతిష్టను...అభివృద్ధి పనులను తాయిలాలుగా ఇచ్చి కాపాడుకోవాలని వ్యూహరచన చేశా రు. 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఏసీడీపీ, బీఆర్‌జీఎఫ్, జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్, ప్రణాళికేతర వ్యయం కింద విడుదలైన, పెండింగ్‌లో ఉన్న నిధులన్నింటి నీ వినియోగించుకోవాలని కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో వివిధ శాఖలకు సంబంధించి రూ.175 కోట్లు విలువైన పనులకు రూపకల్పన చేశారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయించుకుని 20 రోజులగా శంకుస్థాపనలు చేస్తూ వస్తున్నారు.
 
 చకచకా శంకుస్థాపనలు
 ఈలోపే రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొంద డం, సీఎం కిరణ్ రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పా టు కాకపోవడం, ఇంతలోనే రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినె ట్ నిర్ణయించడం జరిగింది. దీంతో ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మిగిలిన పనులన్నింటికీ శంకుస్థాపనలు చేసేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం ఆదరాబాదరగా పనులకు శంకుస్థాపనలు చేసేశారు. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యేలు ఎక్కడికక్క డ పనులకు కొబ్బరికాయ కొట్టేశా రు. మరికొన్నింటికీ ఆదివారం ము హూర్తం పెట్టుకున్నారు. ఇంతలోనే రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.  
 
 తర్జనభర్జన
 మిగిలిపోయిన పనులకు ఎంపీ హోదాలో బొత్స ఝాన్సీలక్ష్మి చేత శంకుస్థాపనలు చేయించే యోచనలో ఉన్నారు. అయితే, దీనిైపై క్లారిటీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డారు. రాష్ట్రపతి పాలన అమల వుతున్న సందర్భంలో ఎంపీ చేత శంకుస్థాపనలు చేసే అవకాశం ఉందా లేదా అనేదానిపై అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఒక వేళ కుదరదంటే అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, తమ ఘనతేనని చెప్పుకునే విధంగా సంబంధిత గ్రామాల్లోకి సమాచారాన్ని చేరవేసేందుకు సిద్ధమవుతున్నారు.  
 
 పనులపై అనుమానాలు 
 ఎన్నికల నోటిఫికేషన్, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో హడావుడిగా మంజూరు చేసిన పనులకు సాంకేతిక ఆమోదం లేనట్టు తెలుస్తోంది. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రతిపాదించి, వాటికి అధికారుల చేత ఆమోద ముద్ర వేయించేశారు. కానీ వాటికి సాంకేతిక అనుమతులు తీసుకోలేదని తెలిసింది. సాధారణంగా సాంకేతిక అనుమతి తర్వాతే వర్క్ ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడదేమీ లేకుండా అధికారులు మంజూరు చేసేశారని సమాచారం. కానీ, అధికార పార్టీ నేతలు మంజూరైందని చెప్పి ఆదరాబాదరగా శంకుస్థాపనలు చేసేస్తున్నారు. నిబంధనల మేరకైతే వర్‌‌క ఆర్డర్ లేని పనులను ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసే కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరించి, ప్రజలను మభ్యపెట్టి, గ్రామ స్థాయి నాయకుల ప్రలోభాలుగా, ఎన్నికల తాయిళాలుగా చకచకా శంకుస్థాపనలు చేసేశారన్న వాదనలు విన్పిస్తున్నాయి.
 

Advertisement
Advertisement