ఇంత నిర్లక్ష్యమా...? | Sakshi
Sakshi News home page

ఇంత నిర్లక్ష్యమా...?

Published Thu, Aug 27 2015 1:46 AM

ఇంత నిర్లక్ష్యమా...? - Sakshi

జీజీహెచ్ అధికారులపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం
 
 పట్నంబజారు(గుంటూరు) :  గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వస్తున్న ప్రజలు వైద్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి నిప్పులు చెరిగారు.  జీజీహెచ్‌లో ఎలుకలు కొరికి పసికందు మరణించిన అంశంపై బుధవారం వైఎస్సార్‌సీపీ నేతలు సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి దుస్ధితి దాపురించిందని మండిపడ్డారు. తక్షణమే మృతిపై విచారణ జరిపించి 15 రోజుల్లోగా నివేదిక తయారు చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని అధికారులను హెచ్చరించారు.

పది రోజుల క్రితం ఎలుకల బెడద ఉందని అధికారులు తెలియజేస్తే పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా మాట్లాడుతూ  తాను స్వయంగా పలుమార్లు అధికారులతో చర్చించినా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పసికందు మరణానికి అధికారులు, ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ పలు విభాగాల నేతలు ఎలికా శ్రీకాంత్‌యాదవ్, పల్లపు రాఘవ, ఆరుబండ్ల వెంకట కొండారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement