పొదల్లో పసిపాప | Sakshi
Sakshi News home page

పొదల్లో పసిపాప

Published Wed, Sep 25 2019 9:15 AM

Girl Child Found In Bushes In Chittoor - Sakshi

 సాక్షి, చిత్తూరు(కొత్తకోట) : తల్లిపొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువు రోడ్డుపాలైంది. నవమాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లయినా తనివితీరా చూసుకుందో లేదో పుట్టిన క్షణాల్లోనే ముళ్లపొదలకు చేరింది. కన్నతల్లికి ఏ కష్టమొచ్చిందో, ఆ బిడ్డ ఎందుకు భారమైందో కాని ఈ సంఘటన మంగళవారం బి.కొత్తకోటలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. బి.కొత్తకోట పంజూరమ్మగుడివీధి, హడ్కోకాలనీ మధ్యలోని పొదల్లో తెల్లవారుజాము 3గంటల సమయంలో తల్లిరక్తం మరకలు ఆరకనే పుట్టిన ఆడబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి పొదల్లో వదిలి వెళ్లిపోయారు. ముళ్లకారణంగా గాయాలయ్యాయి. పసిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉదయం అక్కడి బంకు దగ్గరకు సరుకుల కోసం ఫకృన్నీసా అనే మహిళ చెవికి ఏడుపులు వినపించడంతో అప్రమత్తమైంది.

ఏడుపులు వస్తున్న చోటకు వెళ్లగా కళ్లు తెరవని ఆడశిశువును గుర్తించింది. ఈ విషయం తెలుసుకొన్న అంగన్‌వాడీ కార్యకర్త అనసూయ శిశువును స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు. సంఘటనా స్థలంచేరుకొన్న ఎస్‌ఐ సుమన్‌ స్థానికులను విచారించారు. అనంతరం ఆడశిశువును మదనపల్లెకు తీసుకెళ్లి ఐసీడీఎస్‌ సీడీపీఓ సుజాతకు అప్పగించారు. ఆమె శిశువును జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బుధవారం శిశువును చిత్తూరులోని శిశువిహార్‌కు తరలిస్తామని సుజాత చెప్పారు.   

 

Advertisement
Advertisement