పసికందుకు కన్నీటి వీడ్కోలు | Sakshi
Sakshi News home page

పసికందుకు కన్నీటి వీడ్కోలు

Published Sat, Aug 29 2015 1:38 AM

పసికందుకు కన్నీటి వీడ్కోలు - Sakshi

కృష్ణలంక : ఎలుకలు దాడిలో మృతిచెందిన పసికందు మృతదేహాన్ని గురువారం నగరానికి తీసుకువచ్చారు. గుంటూరు జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి బలైన ఆ శిశువుకు కడసారి వీడ్కోలు చెప్పేందుకు నగరవాసులు భారీగా కృష్ణలంకలోని ఆనందభవన్‌రోడ్డుకు చేరుకున్నారు. వివిధ రాజకీయపార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ శిశువు మృతదేహాన్ని సందర్శించి ఆ మాతృమూర్తి లక్ష్మిని ఓదార్చారు.  గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి గురువారం మధ్యాహ్నం విజయవాడకు తీసుకువచ్చారు. సాయంత్రం పసికందుకు భవానీపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్ సీపీ మైలవరం నియోజక వర్గ సమన్వయకర్త జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనుకొండ శివాజీ, కార్పొరేటర్లు చందన సురేష్, గొరిపర్తి నరసింహారావు, చెన్నుపాటి గాంధీ, అడపా శేషు తదితరులు పసికందు తల్లిని పరామర్శించారు.

ఈ సందర్భంగా  వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ  మాట్లాడుతూ నిర్లక్ష్య వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పసికందు మృతి విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన గుంటూరు వెళ్లి సంఘటనపై డాక్టర్లతో మాట్లాడారు. సంఘటనకు కారణమైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చరిత్రలో లేని ఘోర సంఘటన అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్ధసారథి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు  చేసిన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మరవలేని దారుణం జరగడం శోచనీయమన్నారు. బాలుడు మృతికి ప్రధాన బాద్యత ప్రభుత్వానిదేనని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వారికి ఆస్పత్రిపై బాధ్యత పట్టదా?  అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఈ సంఘటకు ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని  కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అన్నారు. వైద్యులు నిర్లక్ష్యంతో కాకుండా మానవత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు.
 
 

Advertisement
Advertisement