అన్నదాతకు ఆసరా ఇవ్వండి | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఆసరా ఇవ్వండి

Published Fri, Aug 1 2014 1:35 AM

అన్నదాతకు ఆసరా ఇవ్వండి

  •      నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించండి
  •      పట్టణ, గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చండి
  •      లోక్‌సభలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి : దుర్భిక్షంతో తల్లడిల్లుతోన్న రైతులను ఆదుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లోక్‌సభలో కరవుపై జరిగిన చర్చలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం మంజూరు కాలేదన్నారు. తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

    ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని.. రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. వర్షాభావం వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కింద రైతులు, రైతు కూలీలకు భారీ ఎత్తున పని కల్పించాలని సూచించారు. వరుస కరవుతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని.. కనీసం తాగునీళ్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె, రాయచోటి, రాజంపేట వంటి పట్టణాల్లో 15 రోజులకు ఒకసారి నీళ్లందిస్తున్న విషయాన్ని లోక్‌సభ దృష్టికి తెచ్చారు.

    రాజంపేట నియోజకవర్గం పరిధిలోనే కాకుండా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. తక్షణమే చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాల్లో, వైఎస్సార్ జిల్లాలో టమాటా వంటి కాయగూర పంటలు విస్తారంగా సాగుచేస్తారన్నారు.

    టమాటా అధికంగా దిగుబడి వచ్చినప్పుడు ధర దక్కక.. తక్కువ దిగుబడి ఉన్నప్పుడు ఎక్కువగా ధర ఉండటం వల్ల రైతులు లాభపడటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నా.. ప్రజలకు కూరగాయల ధరలు అందుబాటులో ఉండాలన్నా తక్షణమే నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజీ గోదాము నిర్మించాలని డిమాండ్ చేశారు.
     

Advertisement
Advertisement