టీడీపీ కుట్రను ఎదుర్కొనేందుకే ఈదరకు మద్దతు | Sakshi
Sakshi News home page

టీడీపీ కుట్రను ఎదుర్కొనేందుకే ఈదరకు మద్దతు

Published Tue, Jul 15 2014 3:10 AM

టీడీపీ కుట్రను ఎదుర్కొనేందుకే ఈదరకు మద్దతు - Sakshi

మార్కాపురం: జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నాయకుల కుట్రలు తారస్థాయికి చేరాయని..వాటిని ఎదుర్కొనేందుకే చైర్మన్ అభ్యర్థిత్వానికి ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్న ఈదర హరిబాబుకు మద్దతు ఇచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక సబ్ జైలులో ఉన్న మార్కాపురం జెడ్పీటీసీ జవ్వాజి వెంకటరంగారెడ్డిని  సోమవారం సాయంత్రం పరామర్శించిన ఆయన అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలకు నిలయంగా రాష్ట్రం మారిపోయిందని.. వారి అరాచకాలను ఎదుర్కొంటూ కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తామని చెప్పారు. జిల్లా ప్రజలు వైఎస్సార్ సీపీని ఆదరించి 31 మంది జెడ్పీటీసీలను గెలిపించారని, అయితే చంద్రబాబు సీఎం కాగానే అధికారం కోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కి, ప్రలోభాలకు గురిచేసి ముగ్గురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీ సీలను తమ వైపునకు తిప్పుకున్నారన్నారు. ఈనెల 5న ఒంగోలులో జెడ్పీ ఎన్నికల సందర్భంగా అరాచకం సృష్టించి వాయిదా వేయించారని చెప్పారు.
 
ఉగ్రవాదిని పట్టుకున్న చందంగా...
13వ తేదీన మళ్లీ ఎన్నిక జరగనుండగా మార్కాపురం జెడ్పీటీసీ జవ్వాజి వెంకటరంగారెడ్డిని సంతమాగులూరు దగ్గరికి వెళ్లి ఎస్సీ, ఎస్టీ కేసు ఉందని అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. ఉగ్రవాదిలాగా వంద మంది పోలీసులు ఆయన్ను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంద ని ప్రశ్నించారు. ఆదివారం ఒంగోలులో జరిగిన జెడ్పీ చైర్మన్ ఎన్నికలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసేందుకే మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు టీడీపీ నేతల కుట్రలను అమలు చేశారని విమర్శించారు. పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని విధులు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. పోలీసుల తీరుపై మానవ హక్కుల క మిషన్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామని తెలిపారు. రాజ్యాంగ పరంగా రంగారెడ్డికి వచ్చిన ఓటుహక్కును పోలీసులు అడ్డుకున్నారన్నారు.
 
జెడ్పీ చైర్మన్ పదవీ వైఎస్సార్ సీపీకి రాకుండా ఉండేందుకే పోలీసులు, టీడీపీ నేతలు కలిసి కుట్రపన్ని రంగారెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. టీడీపీ నేతల నీచరాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆయన వెంట మార్కాపురం, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, గిద్దలూరు సమన్వయకర్త వై వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు రమణారెడ్డి, పెద్దారవీడు, పెద్దదోర్నాల జె డ్పీటీసీలు డీ వెంకటరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, పెద్ద దోర్నాల ఎంపీపీ టి ప్రభాకర్,  గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతు విభాగం కోఆర్డినేటర్ ఉడుముల కోటిరెడ్డి, పట్టణ, పెద్దారవీడు, కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షులు బట్టగిరి తిరుపతిరెడ్డి,  గొట్టం శ్రీనివాసరెడ్డి, ఆర్ వెంకటరామిరెడ్డి, మండల యూత్ కన్వీనర్ మందటి మహేశ్వరరెడ్డి, సేవాదళ్ జిల్లా అధికార ప్రతినిధి కంది ప్రమీలారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త నాదెళ్ల సుబ్రహ్మణ్యం, నాదెళ్ల చంద్రమౌళి, పార్టీ కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్, బుశ్శెట్టి నాగేశ్వరరావు, ఎంపీపీ ఎల్ మాలకొండయ్య, ఏవన్ గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మీర్జాషంషేర్ అలీబేగ్,  మాజీ మున్సిపల్ చైర్మన్ మీరావలీ, కొనకనమిట్ల ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఉడుముల కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఇతర జిల్లాల్లోనూ టీడీపీ అదే తీరు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోనే కాక..నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ అరాచకాలకు పాల్పడిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గిద్దలూరు పోలీస్ స్టేషన్‌లో ఇటీవల మృతిచెందిన వైఎస్సార్ సీపీ నేత వైజా భాస్కర్‌రెడ్డి దశదిన కర్మకాండ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం వచ్చిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నెల్లూరులో 31 మంది వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ఉండగా..టీడీపీకి 15 మంది మాత్రమే ఉన్నారని..బలం లేకున్నా టీడీపీ జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎన్నికలను వాయిదా వేయిస్తూ కుట్రలకు పాల్పడుతోందన్నారు.
 
గుంటూరు జిల్లాలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టీడీపీ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, మైనార్టీ ఎమ్మెల్యేపై దాడులు చేసి గాయపరిచి..బలవంతంగా ఎంపీటీసీలను ఎత్తుకెళ్లార న్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు దాన్ని విస్మరించారన్నారు. అధికారం శాశ్వతం కాదని, దాన్ని గుర్తించుకుని నాయకులు ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

బీసీ అభ్యర్థి నూకసాని బాలాజీని జెడ్పీ చైర్మన్‌ను చేసుకోలేకపోయామనే బాధ ఉందనీ, ఉపాధ్యక్షునిగా ఎన్నుకునే అవకాశం దొరికిందన్నారు. టీడీపీ నాయకులకు కుక్కకాటుకు చెప్పుదెబ్బ కొట్టినట్లు చేశామన్నారు. టీడీపీ అరాచకాలకు తగిన బుద్దచెప్పే రోజు త్వరలో రాబోతుందని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కుటుంబాలకు, ఎమ్మెల్యే, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు తాము అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement