జీఎంసీకి జరిమానా | Sakshi
Sakshi News home page

జీఎంసీకి జరిమానా

Published Thu, Oct 23 2014 3:26 AM

జీఎంసీకి  జరిమానా - Sakshi

భవన నిర్మాణానికి అనుమతులపై హైకోర్టు తీర్పు
మూడు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశం

 
ఓ భవన నిర్మాణానికి అనుమతిని మంజూరు చేసే విషయంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హైకోర్టు తేల్చింది. ఇందుకు గాను కార్పొరేషన్‌కు రూ.20వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని కార్పొరేషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పుల పట్ల అధికారులు చూపే గౌరవంపైనే న్యాయ పాలన ఆధారపడి ఉందని, కోర్టు తీర్పులను పదే పదే అగౌరవపరిస్తే కఠిన శిక్షలకు గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్ రామచంద్రరావు తన తీర్పులో అధికారులను హెచ్చరించారు. గుంటూరులోని సంపత్‌నగర్, సర్వే నెంబర్ 673లో డి.అంకిరెడ్డి, ఎం.జానకి 875 చదరపు గజాల స్థలాన్ని సరోజనీదేవి అనే మహిళ నుంచి కొన్నారు. ఆ భూమిలో ఇంటి నిర్మాణం నిమిత్తం దరఖాస్తు చేసుకోగా, ఆ భూమి ప్రజోపయోగం కోసం కేటాయించారంటూ ఇంటి నిర్మాణం కోసం అనుమతినిచ్చేందుకు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నిరాకరించారు. దీనిని సవాలు చేస్తూ అంకిరెడ్డి, జానకి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని జస్టిస్ రామచంద్రరావు విచారించారు. సదరు భూమిని ప్రజోపయోగం కేటాయించలేదని, అది సరోజనీదేవి పూర్వీకులకే చెందుతుందంటూ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు స్పష్టం చేసినా కూడా గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. పిటిషనర్లు సరోజనీదేవి నుంచి కొన్న 875 చదరపు గజాల భూమి ప్రజోపయోగాల కోసం కేటాయించింది కాదని కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా, పిటిషనర్ల భవన అనుమతి నిర్మాణ దరఖాస్తును తిరస్కరించడం మునిసిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యానికి నిదర్శమని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కార్పొరేషన్ పొగరుబోతు వైఖరి, నిర్లక్ష్యపు తీరు కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని తేల్చి చెప్పారు. ఇందుకు గాను కార్పొరేషన్‌కు రూ.20వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్లకు మూడు వారాల్లో చెల్లించాలని కార్పొరేషన్‌నున ఆదేశించింది.
 

Advertisement
Advertisement