గోవా సరుకు! | Sakshi
Sakshi News home page

గోవా సరుకు!

Published Fri, Dec 12 2014 2:40 AM

Goa stock!

సాక్షి ప్రతినిధి, కర్నూలు : నకిలీ మద్యం వ్యాపారంలో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు దూసుకుపోతున్నారు. గతంలో జిల్లాలో బయటపడ్డ నకిలీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన డోన్ ఎంపీపీ కొడుకుతో పాటు ఏకంగా జెడ్పీ చైర్మన్ పేరు కూడా బయటకు వచ్చింది. తాజాగా రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో దొరికిన నకిలీ మద్యం వ్యవహారంలోనూ డోన్ మునిసిపాలిటీకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరి హస్తం ఉందనే ప్రచారమూ జరుగుతోంది.
 
 సదరు నేత జిల్లాలోని ముఖ్యనేతను కలిసి రక్షించాలని వేడుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ నకిలీ మద్యం వ్యాపారమంతా జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు సిండికేటుగా ఏర్పడి గోవాలోని ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకుని నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం నకిలీ మద్యం వ్యాపారమంతా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని చిన్న చిన్న బెల్టు షాపులను కేంద్రంగా చేసుకుని సాగుతోంది. ఎక్కడా తమ పేర్లు బయటకు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారం సాగిస్తున్న తీరును చూసి విచారణ చేస్తున్న ఎక్సైజ్ అధికారులే నివ్వెరపోతున్నారు.
 
 బళ్లారి కేంద్రంగా ఏజెంట్లు..
 జిల్లాలోకి వస్తున్న నకిలీ మద్యమంతా గోవాలోని డిస్టలరీల నుంచే వస్తోందని విచారణలో అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి బెంగళూరుకు తర్వాత బళ్లారి మీదుగా రాష్ర్టంలోకి తరలిస్తున్నారు. గోవా నుంచి వచ్చిన మద్యానికి బళ్లారిలో కొంతమంది బ్రోకర్లు.. రంగు, రుచి కోసం ప్రత్యేకమైన రసాయనాలను కలుపుతున్నారు. అక్కడే అచ్చం మద్యం బాటిళ్లల్లోనే ఈ నకిలీ మద్యాన్ని నింపుతున్నారు. ఈ మొత్తం దందా అంతా ముగ్గురు, నలుగురు ఏజెంట్లు కలిపి నడిపిస్తున్నారని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇందులో ఒకరి పేరు సురేష్ అని.. మరొకరి పేరు బంటి అని విచారణలో తెలిసింది. అయితే, ఇవి అసలు పేర్లా? లేక నకిలీ పేర్లా? లేదా రెండు పేర్లు ఒక్కరివా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఏజెంట్లతో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు సంబంధాలు పెట్టుకుని నకిలీ మద్యం తెప్పించుకుంటున్నారు. ఈ నకిలీ మద్యం చేరవేతలో కొత్త పంథాను అవలంభిస్తున్నట్టు విచారణలో ఎక్సైజ్ అధికారులు గ్రహించారు.
 
 సరఫరా చేస్తున్నారిలా...!
 జిల్లాలోని పలువురు తెలుగు తమ్ముళ్లు బళ్లారిలోని ఏజెంట్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. అక్కడి నుంచి సరుకు కావాలంటే సదరు ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. ఫలానా ప్రాంతానికి తమకు సరుకు పంపించాలని చెబుతున్నారు. అనంతరం బళ్లారిలోని ప్రధాన ఏజెంట్లు తమ కిందిస్థాయి ఏజెంట్లకు చెప్పి ఫలానా ప్రాంతానికి ఇంత లోడు పంపించాలని ఆదేశిస్తున్నారు. ఈ కిందిస్థాయి ఏజెంట్లు.. డ్రైవర్ల ద్వారా సరుకు చేరవేస్తున్నారు. సదరు డ్రైవరు నెంబరును ఇక్కడి నేతలకు చెబుతున్నారు. ఈ నేతలు డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ సరుకు వచ్చిన వెంటనే తీసుకుంటున్నారు. అయితే, లోడ్ ఇవ్వడమే ఆలస్యం... వెంటనే డ్రైవర్లు తమ నెంబరును పడేస్తున్నారు. ఇక్కడి నేతలు కూడా ఇదే పని చేస్తున్నారు. అంటే ఆర్డర్‌కు ఒక ఫోన్ నెంబరు వాడుతున్నారన్నమాట.
 
 శివారు బెల్టు షాపులే లక్ష్యంగా...!
 గోవా నుంచి తెస్తున్న నకిలీ మద్యం విక్రయాలకు కర్ణాటక రాష్ర్ట శివారులోని చిన్న చిన్న బెల్టు షాపులను తెలుగు తమ్ముళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. వాస్తవానికి బెల్టు షాపులకు వైన్ షాపుల నుంచి సరుకు రావడం కొంచెం కష్టమయ్యింది. మరోవైపు అదే బ్లాక్ పేపరు, అదే మందు.. అయితే, కర్ణాటక మద్యం అంటూ చిన్న చిన్న బెల్టు షాపుల నిర్వాహకులకు మొదటగా రెండు బాక్సులు శాంపుల్స్‌గా ఇచ్చి వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఇక్కడి కంటే తక్కువ ధరకు వస్తుండటంతో బెల్టు షాపు నిర్వాహకులు కూడా దీనినే తీసుకుంటున్నారు.
 
  చివరకు ఈ విధంగా నకిలీ మద్యం వ్యాపారం జిల్లా అంతటా భారీగా పాకిపోయింది. ఈ మొత్తం నకిలీ మద్యం వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లు ఒకరికొకరు భారీగా చేతులు కలిపి సిండికేటుగా ఏర్పడి సాగిస్తున్నారు. మొత్తం మీద గోవా నుంచి వచ్చి బళ్లారి కేంద్రంగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యాపార గుట్టును చేధించాలంటే కర్ణాటక ప్రభుత్వ సహకారం తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రభుత్వంతో కలిసి విచారణ సాగిస్తే.. అక్కడి ఏజెంట్లతో పాటు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లందరి వ్యవహారం బయటకు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisement
Advertisement