దేవుడా నీవే దిక్కు! | Sakshi
Sakshi News home page

దేవుడా నీవే దిక్కు!

Published Sat, Aug 31 2013 3:39 AM

god only have to save

అడ్డాకుల, న్యూస్‌లైన్: వంశోద్ధారకుడు పుట్టినందుకు సంతోషించాలో.. లేక కడుపు బయట అవయవాలు అంటిపెట్టుకుని పుట్టిన కొడుకును చూసి బాధపడాలో తెలియక ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. కొడుకు పుట్టినప్పుడు పొట్ట దిగువభాగానికి అంటిపెట్టుకుని చిన్న కణితి మాదిరిగా ఉన్న అవయవాలు బాబు పెరిగేకొద్దీ పెరుగుతున్నాయి. కొడుకుకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వివరాల్లోకెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘణపురం మండలం మానాజీపేట గ్రామానికి చెందిన నాగయ్య, లక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర క్రితం బాలుడు పుట్టాడు. తొలకాన్పులోనే కొడుకు పుట్టాడని ఆంజనేయులు అని పేరు పెట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పుట్టుకతోనే బాలుడి కడుపులో ఉండాల్సిన అవయవాలు కొన్ని చిన్న కణితి మాదిరిగా పొట్ట భాగాన్ని అంటిపెట్టుకుని పూర్తి బయట పెరిగాయి. బాలుడిని మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రితో పాటు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులకు చూపించారు. అలాగే హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో చూపించి ఇప్పటివరకు సుమారు లక్షరూపాయల వరకు ఖర్చుచేశారు. అయినా సరైన వైద్యం చేయలేకపోయారు. ఆంజనేయులుకు ఆపరేషన్ చేయడానికి వైద్యులు వెనకడుగు వేస్తున్నారని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే వయసుతో పాటు అవయవాల కణితి కూడా రోజురోజుకు పెరిగి పెద్దదవుతోంది. బాలుడు లేచి నిలబడలేని విధంగా మారింది.
 
 బాలుడిని ఎత్తుకోవాలంటే కణితిని ప్రత్యేకంగా పట్టుకోవాల్సి ఉంటుంది. చిన్నారి పొట్టపై పెరిగిన అవయవాలను ఆపరేషన్ ద్వారా కడుపులోపల అమర్చవచ్చని వైద్యులు చెప్పినట్లు బాలుడి తల్లి లక్ష్మి తెలిపింది. ఈ అరుదైన వైద్యం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే సాధ్యమవుతుందని, లక్షన్నర రూపాయలు మేర ఖర్చువుతాయని ఇంతకుముందుకు చూసిన వైద్యులు తెలిపారని ఆమె పేర్కొంది. అంతమొత్తంలో ఖర్చుచేసే స్థోమత లేకపోవడంతో, తన కొడుక్కి ఏమవుతుందోనని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.  దేవుడా నీవే దిక్కు..అంటూ దేవుడిపైనే భారం వేసింది.  
 

Advertisement
Advertisement