ఘనంగా ముగిసిన మహాపుష్కరాలు | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసిన మహాపుష్కరాలు

Published Sat, Jul 25 2015 6:39 PM

ఘనంగా ముగిసిన మహాపుష్కరాలు - Sakshi

రాజమండ్రి/బాసర:
రెండు తెలుగు రాష్ట్రాల్లోను గోదావరి మహా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. సాయంత్రం 6.38 గంటలకు పుష్కరుడి నిష్క్రమణతో గోదావరి పుష్కరాలు ముగిసినట్లు పండితులు తెలిపారు. ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలోను, తెలంగాణలోని బాసరలోను భారీ స్థాయిలో ఉత్సవాలు జరిగాయి. రాజమండ్రిలో ప్రముఖ విద్వాంసుడు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో సాయంత్రం 6 గంటలకు కచేరీ నిర్వహించారు. అలాగే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో వెయ్యిమంది కూచిపూడి కళాకారులతో నృత్యోత్సవం ఏర్పాటు చేశారు. చిట్టచివరి రోజు కావడంతో రాజమండ్రి సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఘాట్లకు భక్తులు పోటెత్తారు. శనివారం రాజమండ్రిలోని వీఐపీ ఘాట్లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పుణ్య స్నానం చేయగా, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాదక్షేత్రం పుష్కరఘాట్లో బీజేపీ కార్యదర్శి రాంమాధవ్ పుష్కర స్నానం ఆచరించారు.

ఇక తెలంగాణలోని బాసరలో కూడా పుష్కరాల ముగింపు వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. బాసర నుంచి గోదావరి తీరం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. అలాగే గోదావరి నదీ తీరంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.బాసర సరస్వతీ ఆలయం నుంచి పుష్కర ఘాట్ కు శోభాయాత్ర తరలిరానుంది. పుష్కర జ్యోతి, ఆకాశ జ్యోతి కార్యక్రమాలను నిర్వహించింది.ఈ కార్యక్రమానికి మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు హాజరయ్యారు. పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది అందరికీ సోమ, మంగళవారాలు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నిర్విరామంగా 12 రోజుల పాటు విధులు నిర్వర్తించడంతో వాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారని, ఒక్క ఆదివారం విశ్రాంతి సరిపోదన్న ఉద్దేశంతో ఈ సెలవు ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement