బంగారం బంద్ | Sakshi
Sakshi News home page

బంగారం బంద్

Published Wed, Mar 30 2016 2:31 AM

Gold shop strike

దానవాయిపేట (రాజమహేంద్రవరం) :బంగారం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధించడాన్ని నిరసిస్తూ వర్తకులు మంగళవారం నుంచి మరోసారి బంద్ పాటిస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా వచ్చే నెల పదో తేదీ వరకూ ఈ బంద్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మార్చి 2 నుంచి 17వ తేదీ వరకూ బంగారు వర్తకులు తొలి విడత బంద్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పూ లేకపోవడంతో మంగళవారం నుంచి రెండో దఫా దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలోని 2 వేలకు పైగా బంగారు దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పలువురు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే బంద్ కారణంగా జ్యూయలరీ షాపులు మూత పడడంతో కొనుగోలుదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
 
 నిలిచిన లావాదేవీలు
 జిల్లాలో రోజుకు సుమారు రూ.40 కోట్ల ఆభరణాల విక్రయాలు జరుగుతున్నాయని అంచనా. గత ఏడాది పుష్కరాల కారణంగా పెళ్లి ముహూర్తాలు లేక అమ్మకాలు సరిగ్గా  జరగలేదు. గత నెలలో పెద్ద ఎత్తున వివాహాలు జరగడంతో భారీగా అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు ఆశించారు. ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఒక శాతం ఎక్సైజ్ పన్ను, రూ.2 లక్షలకు మించిన బంగారం విక్రయాలపై పాన్‌కార్డువంటి నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీనిపై వ్యాపారులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
 
 వినియోగదారులపై పన్నుభారం
 ఒక శాతం ఎక్సైజ్ సుంకంతో ఇటు వర్తకుడి పైన అటు కొనుగోలుదారుడిపైన పన్ను భారం పడుతుందని వ్యాపారులు అంటున్నారు. బులియన్ మార్కెట్‌ను అనుసరించి బంగారం  ధరలో హెచ్చుతగ్గులుంటాయని, కానీ ఒక శాతం ఎక్సైజ్ సుంకం పెంపుతో బంగారం ధరతో సంబంధం లేకుండా పన్ను భారం పడుతుందని అంటున్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో కూడా బంగారంపై ఎక్సైజ్ సుంకాన్ని అమలు చేశారని, అయితే అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ దానిని రద్దు చేశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఎక్సైజ్ పన్ను అంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 కేంద్రం పునరాలోచించాలి
 బంగారం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఒక శాతం ఎక్సైజ్ పన్ను విధించడంవల్ల అటు కొనుగోలుదారులపైన, వ్యాపారుల పైన తీవ్ర భారం పడుతుంది. ఈ పన్నుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే నిరవధిక బంద్‌కు సైతం వెనుకాడం.
 - కడియాల శ్రీనివాసరావు, సువర్ణ వర్తక సంఘం రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడు
 

Advertisement
Advertisement