నమ్మించి.. నట్టేటముంచి..! | Sakshi
Sakshi News home page

నమ్మించి.. నట్టేటముంచి..!

Published Wed, Aug 2 2017 1:03 PM

నమ్మించి.. నట్టేటముంచి..! - Sakshi

► వంగిపురం బ్రాంచి పోస్టాఫీసులో భారీ గోల్‌మాల్‌!?
► ఓ మహిళ చేతికి పొదుపు, ఆర్‌డీ, ఇన్సూరెన్స్‌ డబ్బులిచ్చిన గ్రామస్తులు
► పోస్టాఫీసులో జమ చేయని వైనం
► ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతం ?

వంగిపురం (ప్రత్తిపాడు): తమ ఇంట్లో పోస్టాఫీస్‌ ఉండడంతో అందులో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికి ఖాతాదారుల నుంచి నగదు వసూలు చేసిన ఓ మహిళ ఉదంతం బట్టబయలైంది. మండలంలోని వంగిపురంలో బ్రాంచి పోస్టాఫీసు ఉంది. పోస్ట్‌మాస్టర్‌గా (బీపీఎం) దాది సుమాంజలి విధులు నిర్వర్తిస్తున్నారు. పోస్టాఫీసుకు సొంత భవనం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన రిటైర్డ్‌ పోస్ట్‌మాస్టర్‌ కూతురు ఆరుమళ్ల సరోజిని ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సరోజిని తండ్రి గతంలో పోస్ట్‌మాస్టర్‌గా పని చేశారు. ఈమె కూడా కొన్ని సంవత్సరాల క్రితం బీపీవోకు అసిస్టెంట్‌గా ఖాతాదారులందరికీ సుపరిచితురాలు. కూలి పనులు చేసుకుంటూ చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకుందామని పోస్టాఫీసులకు వచ్చే వారి అమాయకత్వాన్ని సరోజిని క్యాష్‌ చేసుకుంది. పోస్టాఫీసు ఉద్యోగిలా నమ్మబలికి అందరి నుంచి పొదుపు డబ్బులు, ఆర్‌డీ సొమ్ములు, ఇన్సూరెన్స్‌ నగదును నెలనెలా వాయిదాల (రోజువారీ, వారాల వారీ, నెలనెల, ఏడాదికోసారి) రూపంలో తీసుకుంటుంది. ఖాతాదారుల పోస్టల్‌ పుస్తకాలను సైతం వారికి ఇవ్వకుండా సరోజిని తనవద్దే ఉంచుకుంటూ పెద్ద ఎత్తున చీటింగ్‌కు పాల్పడుతూ వచ్చింది.
 
బీపీఎం ఎవరో తెలియకుండా జాగ్రత్త పడుతూ..
పది గంటల తరువాత పోస్టాఫీసుకు వస్తే సాయంత్రం ఐదు గంటల తరువాత, ఉదయం ఎనిమిది గంటలలోపు రావాలని చెప్పి సరోజిని ఖాతాదారులను వెనక్కు పంపించేది. దీంతో ప్రజలకు అసలు వంగిపురం బ్రాంచిలో బీపీఎం ఉందన్న సంగతి కూడా తెలియకుండా జాగ్రత్త పడింది. ఎప్పుడైనా ఇతర పనులపై పోస్టాఫీసుకు వచ్చిన ఖాతాదారులకు అసలు బీపీఎం సుమాంజలి కనిపిస్తే ఆమె మట్టి డబ్బులు (ఉపాధి పనుల డబ్బులు) ఇవ్వడానికి, పింఛను ప్రత్యేకంగా వస్తుందని చెప్పి ప్రజలను మభ్యపెట్టింది. 
 
భారీ మొత్తంలో.. 
బ్రాంచి పోస్టాఫీసులో సుమారు రెండు వందల వరకు ఖాతాదారులు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుటుంబంలో రెండు, మూడు, నాలుగు పొదుపు ఖాతాలు, ఆర్డీలు, సేవింగ్స్‌లు చేసుకుంటున్న వారు ఉన్నారు. వీరు నెలనెలా వారి స్థాయిని బట్టి పొదుపు చేసుకుంటున్నారు. సుమారుగా రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ప్రజల సొమ్ము కాజేసినట్లు సమాచారం.
 
ఖాతా పుస్తకాల్లో పోస్టల్‌ స్టాంప్‌లు వేసి మరీ.. 
పోస్టాఫీసు తన ఇంట్లోనే ఉండటం సరోజినికి బాగా కలిసొచ్చింది.  గ్రామాల్లో ప్రజలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పొలం పనులకు వెళతారు. దీంతో సరోజిని ఇంట్లోనే పోస్ట్‌ ఆఫీస్‌ కావడంతో ఉదయం ఎనిమిది గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తరువాత జనం తమ ఖాతాల్లో డబ్బును జమ చేయాలని సరోజిని వద్దకు వెళుతుంటారు. ఆ సమయంలో బీపీఎం పోస్టాఫీసులో ఉండకపోవడం, పోస్టాఫీసుకు సంబంధించిన ముద్రలు సైతం అక్కడే అందుబాటులో ఉండటంతో పుస్తకాలపై ముద్ర వేసి, ఓ చిన్న సంతకం చేసి పుస్తకాలను ఇచ్చేది. కానీ డబ్బును వారి ఖాతాలకు జమ చేయించేది కాదు. 
 
పోస్టల్‌ అధికారుల విచారణ.. 
గ్రామానికి చెందిన పి. సామ్రాజ్యమ్మ హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఈమె తన మనవడు, మనవరాలు పేరుతో ఆర్డీలు కట్టుకుంటుంది. తన పాస్‌ పుస్తకాలను ఇవ్వాలని కొద్ది రోజులుగా సరోజినిని అడుగుతోంది. అధికారులు తనిఖీకి తీసుకెళ్లారని సరోజిని ఆమెకు చెప్పింది. అనుమానం వచ్చిన సామ్రాజ్యం పోస్టల్‌ అధికారులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలియడంతో వ్యాపించడంతో ఎవరికి వారు మా పుస్తకాలు.. మా పుస్తకాలు అంటూ సరోజిని వద్దకు వెళ్లడంతో బాగోతం బట్టబయలైంది. సోమవారం సాయంత్రం సౌత్‌సబ్‌ డివిజన్‌ ఇన్‌కస్పెక్టర్‌ జి. హనీ బ్రాంచి పోస్టాఫీసుకు చేరుకుని అక్కడ ఉన్న వందల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement