కేంద్ర సాయంపై ఆశలు | Sakshi
Sakshi News home page

కేంద్ర సాయంపై ఆశలు

Published Sun, Mar 8 2015 1:48 AM

కేంద్ర సాయంపై ఆశలు

హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం తప్పనిసరని, ఆ దిశగా కేంద్రం నుంచి సాయం అందుతుందని ఆశిస్తున్నామని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం ఆయన ఏపీ అసెంబ్లీ, శాసన మండలి(ఉభయ సభలు)ని ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం 8.55 నిమిషాలకు ప్రారంభించిన ప్రసంగాన్ని 9.30 గంటలకు ముగించారు. రాజధాని కోసం భూములు సేకరించిన విషయాన్ని ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి "అంతా అబద్ధం.. షేమ్.. షేమ్" అంటూ అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం నుంచి ముగిసే వరకు.. సీపీఐ ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖరరావు "ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి" అని రాసున్న ప్లకార్డులను పట్టుకొని నిలబడ్డారు. 35 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ఆఖరు అర నిమిషం గవర్నర్ తెలుగులో చదివారు. "రాష్ట్రాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. రాజధానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఆర్థికంగా కేంద్రం నుంచి సాయం అందుతుందని ఆశిస్తున్నాం. ఉభయ సభల్లో అర్థవంతమైన చర్చలు జరపాలని అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేస్తున్నా" అని ముగించారు.
 
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • పపంచంలో ఎక్కడా జరగనంతగా, అతిపెద్ద భూ సమీకరణను రాజధాని నిర్మాణం కోసం పూర్తి చేశాం.33వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛం దంగా ఇచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ తొలి దశ ఈ ఏడాది జూన్ నాటికి చేతికొస్తుంది.
  • అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరగడం వల్ల పలు సమస్యలతో పాటు ఆర్థిక లోటు ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. హుద్‌హుద్ తుపాను, కరువు వల్ల కష్టాలు పెరిగాయి. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తోంది.
  • కేంద్రం నుంచి మద్దతుంటుందని ఆశించినా.. 2015-16 బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ దక్కలేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మనం.. రెవెన్యూ మిగులున్న పొరుగు రాష్ట్రంతో పోటీ పడలేకపోతోంది.
  • వినూత్న వృద్ధి వాతావరణాన్ని సృష్టించి అవకాశాలు అందుకోడానికి వీలుగా విజన్-2050 డాక్యుమెంట్ తయారీని ప్రభుత్వం ప్రారంభించింది.
  • 2022 నాటికి టాప్-3 రాష్ట్రాల్లో ఒకటి, 2029కి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
  • వివిధ రంగాల్లో వృద్ధిరేటు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వృద్ధి అనుకూల విధానాలు లాభాలు అందించడాన్ని ప్రారంభించాయి. జాతీయ వృద్ధిరేటు 7.4 శాతం కంటే ఏపీలో కనీసం ఒక శాతం అధికంగా ఉంటుందని అంచనా . కరువు పరిస్థితులున్నా.. వ్యవసాయంలో 5.9 శాతం, పరిశ్రమల రంగంలో 5.25 శాతం వృద్ధిరేటు నమోదు కావడం ఊరట కలిగిస్తోంది.
  • 7మిషన్లు, 5 ప్రచార విధానాలు.. అన్ని రంగాల్లో అభివృద్ధికి ఊతం ఇస్తాయి. హా రాష్ట్రంలో ప్రాంతాల మధ్య అసమానతలున్నాయి. ఖనిజాలు, సహజ సంపద ఉన్నా రాయలసీమ వెనకబడింది. గోదావరి జిల్లాల రైతుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా.. గోదావరి నీటిని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదికి మళ్లించడానికి చర్యలు ప్రారంభించాం. తద్వారా రాయలసీమకి హంద్రీనీవా, గాలేరునగరి, ఇతర ప్రాజెక్టుల ద్వారా సాయపడొచ్చు. సీమలో ఉత్పాదకత పెంపునకు బిందు, తుంపర సేద్య విధానాలను మరింత ఎక్కువగా ఉపయోగించేందుకు చర్యలు చేపడుతున్నాం.
  • ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ‘రైతు సాధికార సంస్థ’ ద్వారా రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.హా రూ.2,219 కోట్ల విలువైన 16.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను రైతుకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేశాం. హా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచాం. పరిహారం కింద 3.5 లక్షలు, బాకీలు చెల్లించడానికి రూ. 1.5 లక్షలు ఉంటుంది.
  • జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 100 కోట్ల స్వల్ప మొత్తాన్ని కేటాయించడంతో ప్రభుత్వ ప్రణాళికలకు భంగం కలిగింది. అయినా, 2018 మార్చికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కృషి చేస్తాం. హా బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీల అభ్యున్నతికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. హా ఇమామ్‌లకు గౌరవ వేతనాన్ని ప్రవేశపెట్టే అంశం ప్రభుత్వ యోచనలో ఉంది. హా డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.10 వేలు, దానిపై వడ్డీని రద్దు చేస్తాం.
  • పిల్లలు, గర్భిణిలకు పౌష్టికాహారం అందించేందుకు పరిస్థితులు దారుణంగా ఉన్న మూడు జిల్లాల్లో పనిచేయడానికి 2,415 పౌష్టికాహార కౌన్సిలర్లు, 6,432 లింక్ వర్కర్ల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. హా మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ‘జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్’ కోసం సంస్థాగత యంత్రాంగాన్ని తయారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హా గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు రోజంతా నిరంత విద్యుత్ సరఫరా చేయడానికి, రైతులకు 7 గంటలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. హా ఓడరేవుల ఆధారిత అభివృద్ధి విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. 2015-16లో 4 కొత్త పోర్టులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.హా తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి ఆధునీకరించడంతో పాటు విశాఖ సమీపంలో భోగపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది.
  • కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు, తుంకూరు నుంచి తిరుపతి, విజయవాడ నుంచి నెల్లూరు వరకు గ్యాస్ పైపు లైన్లు వేయనున్నాం. ప్రతి కుటుంబానికీ పైప్ ద్వారా గ్యాస్ అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
  • పారిశ్రామిక సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడానికి ఈ-బిజ్, సింగిల్ డెస్క్ క్లియరెన్స్ వ్యవస్థలను ప్రవేశపెట్టాం.హా జాతీయ ఐటీ ఎగుమతుల్లో 5 శాతం వాటా సాధించడం లక్ష్యం. హా    టీచర్లు, ఇతర ఉద్యోగాల భర్తీకి త్వరలో చర్యలు చేపట్టనున్నాం.

Advertisement
Advertisement