ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలి

Published Sun, Jul 20 2014 1:35 AM

ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలి

ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాలని ఇంటర్మీడియట్ విద్య గుంటూరు జోన్ ఆర్‌జేడీ డి.రామకృష్ణ పరమహంస కోరారు. స్థానిక ఏకేవీకే జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, గురుకుల, మోడల్ కళాశాలల ప్రధానాచార్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐవో పి.మాణిక్యం అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఆర్‌జేడీ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్య కీలకమన్నారు.
 
అందువల్ల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా ప్రధానాచార్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను ముందుకు నడిపిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో గత సంవత్సరం పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులందరినీ రెన్యువల్ చేసుకుని విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని రామకృష్ణ పరమహంస సూచించారు. జిల్లాలో మొత్తం 240 మంది కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు.
 
కళాశాలల్లో అడ్మిషన్లకు ఈ నెలాఖరు వరకూ గడువున్నందున అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలన్నారు. జిల్లాలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో 26 వేల మంది విద్యార్థులు చేరగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 11,089 మంది మాత్రమే చేరారన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులంతా ఇంటర్‌లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెలలో అన్ని కళాశాలలను సందర్శించి మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
 
ఆర్‌ఐవో పి.మాణిక్యం మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో మంచి ఫలితాలు సాధించినందున అడ్మిషన్లు కూడా ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. పామూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకునిగా పనిచేస్తూ బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించిన ఫిజిక్స్ లెక్చరర్ ఎంవీ సురేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, గురుకుల, మోడల్ కళాశాలల సిబ్బంది రూ.66 వేలు వసూలు చేసి ఆర్‌జేడీ, ఆర్‌ఐవో చేతుల మీదుగా పామూరు ప్రిన్సిపాల్‌కు అందజేశారు. ఆ చెక్కును సురేష్ భార్యకు అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జె.నాగేశ్వరరావు, ఎస్.సత్యనారాయణ, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ అధ్యక్షుడు కేపీ రంగనాయకులు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ అధ్యక్షుడు కుమ్మరగుంట సురేష్, ఎయిడెడ్ అధ్యాపకుల సంఘ నాయకుడు నాగేశ్వరరావు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
 
23న జాబ్‌మేళా...
గుంటూరులోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈ నెల 23వ తేదీ ఒకేషనల్ విద్యార్థులకు అప్రంటీస్ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రామకృష్ణ పరమహంస తెలిపారు. ఈ జాబ్‌మేళాకు వివిధ పరిశ్రమల ప్రతినిధులు హాజరై ప్రతిభావంతులైన ఒకేషనల్ విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేస్తారన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ఆయా కంపెనీల్లోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. గుంటూరు జోన్ పరిధిలోని పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఒకేషనల్ విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement