వట్టిదే..! | Sakshi
Sakshi News home page

వట్టిదే..!

Published Sun, Nov 10 2013 2:02 AM

Government failed to give input subsidy

 చీరాల, న్యూస్‌లైన్:  ‘భారీ వర్షాలు, వరదలకు ముంపునకు గురైన పొలాల రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు రైతులకు సబ్సిడీతో కూడిన వరి, శనగ విత్తనాలందిస్తాం.’ ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా పర్చూరులో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిన మాటలివి. సబ్సిడీ విత్తనాలు ఇస్తామన్న కిరణ్‌కుమార్‌రెడ్డి సాగు సమయం మించిపోతున్నా వాటి ఊసే మరిచిపోయారు. స్వయంగా ముఖ్యమంత్రే సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తామని చెప్పగా వ్యవసాయాధికారులు మాత్రం అటువంటి విత్తనం వచ్చే అవకాశం లేదనడం చూస్తే ప్రభుత్వానికి రైతులపై ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
 ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొమ్మమూరు ఆయకట్టు కింద ఉన్న కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో వేసిన వరి ముంపునకు గురై పనికి రాకుండా పోయింది. కొమ్మమూరు ఆయకట్టు కింద లక్ష ఎకరాల్లో వరి సాగవుతుంది. మామూలుగా 92 రకం వరి పైరును సాగు చేస్తారు. అకాల వర్షాలకు ముంపునకు గురై, సాగుకు సమయం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులకు ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి విత్తనాలను అందించాలని వ్యవసాయాధికారులు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రిని పర్చూరులో జరిగిన సమీక్ష సమావేశంలో కోరారు. వెంటనే సీఎం ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, అక్కడ నుంచి తెప్పించి రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చి రెండు వారాలు గడుస్తున్నా ఎన్‌ఎల్‌ఆర్ 145 విత్తనం జిల్లాకు రాలేదు. అలానే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఈ విత్తనం అందుబాటులో లేదని వ్యవసాయాధికారులంటున్నారు.
 ఈ విత్తనం వచ్చే అవకాశం కూడా లేదని తేలింది. అంటే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు రైతులకు అందే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే నవంబర్ కూడా రావడంతో వరి సాగు చేసే సమయం మించిపోతోంది. ప్రస్తుతం ఆ విత్తనం వచ్చినప్పటికీ రైతులకు ప్రయోజనం ఉండదు. ఇప్పటికే రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి 10010 అనే రకం విత్తనాన్ని 30 కేజీల బస్తా రూ 1200 చొప్పున కొనుగోలు చేసి నార్లు పోశారు.
 ఎన్‌ఎల్‌ఆర్ 145తో మేలు...
 ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి విత్తనం సాగుకు అనుకూలంగా ఉంటుంది. 145 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ముఖ్యంగా పైర్లకు తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే 10010 రకానికి అయితే తెగుళ్లు అధికంగా ఆశిస్తాయి. దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండదు.
 ఏడీఏ ఏమంటున్నారంటే...
 ‘ఈ ప్రాంతంలో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనం సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో నివేదించాం. కానీ నెల్లూరు జిల్లాలో కూడా ఆ విత్తనం అందుబాటులో లేదు. రైతులు ప్రస్తుతం వేస్తున్న 10010 రకం విత్తనాలకు తెగుళ్లు అధికంగా ఆశించే అవకాశం ఉంది. రైతులు ఎన్‌ఎల్‌ఆర్ 145 బదులుగా ఎన్‌ఎల్‌ఆర్ 344499 రకాన్ని సాగు చేయడం మంచిది’ అని ఏడీఏ మస్తానమ్మ తెలిపారు.

Advertisement
Advertisement