ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

Published Sat, Aug 1 2015 4:05 AM

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

- అంబేడ్కర్ వర్సిటీ సేవలు నిలిపివేతపై ఆందోళన
- విద్యార్థులు ఉద్యమం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
- వర్సిటీ రీజనల్ జేడీ సీహెచ్ ప్రసాద్
గుంటూరు ఎడ్యుకేషన్ :
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ సేవలు కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని కోరుతూ వర్సిటీ రిజిస్ట్రార్ ఏపీ ప్రభుత్వానికి నాలుగుసార్లు లేఖలు రాసినా స్పందించకపోవడంతో వారు సేవలను నిలిపివేశారని, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని వర్సిటీ విజయవాడ ప్రాంతీయ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ చాముండేశ్వరి ప్రసాద్ అన్నారు. జేకేసీ కళాశాలోని బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో శుక్రవారం వర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు, కౌన్సిలర్లు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జేడీ చాముండేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలోని 13 జిల్లాల్లో  92 అధ్యయన కేంద్రాలు, ఏడు ప్రాంతీయ అధ్యయన కేంద్రాల ద్వారా అంబేడ్కర్ వర్శిటీపై ఆధారపడి 3.50 లక్షల మంది అభ్యర్థులు డిగ్రీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారని చెప్పారు. రెండు నెలల క్రితం ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  

విద్యార్థులు ఉద్యమబాట పట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్సిటీలో ప్రవేశాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆరోపించారు. వర్సిటీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ పి.గోపీచంద్ మాట్లాడుతూ దూర విద్యా వ్యాప్తి లక్ష్యంతో ఎన్టీఆర్ స్ధాపించిన అంబేడ్కర్ వర్సిటీలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. దీనిపై గవర్నర్, సీఎం, విద్యాశాఖ మంత్రికి పోస్ట్‌కార్డులు పంపుతామన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement