ప్రభుత్వ ఉపాధ్యాయుల వాదులాట! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉపాధ్యాయుల వాదులాట!

Published Wed, Jan 22 2020 1:20 PM

Government Teachers Assault Each Other in Vizianagaram - Sakshi

విజయనగరం, దత్తిరాజేరు: పిల్లలకు బుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు తమలో తామే ఢీ అంటే ఢీ అన్నారు. నువ్వెంతంటే... నువ్వెంత! అన్న రీతిన వాదులాటకు దిగారు. పలువురు వారించినా ఎవరి మాట వినలేదు. అదో సమావేశమన్న విషయం మరచి అందరి ముందరే కొట్టుకున్నంత పని చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దత్తిరాజేరు విద్యా శాఖ కార్యాలయంలో ఎంఈఓ అధ్యక్షతన ప్రధాన ఉపాధ్యాయులకు మంగళవారం వార్షిక ప్రణాళిక సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయ నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక యూనియన్‌కు చెందిన ఉపాధ్యాయుడు జీతాల విషయమై ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో మరో ఉపాధ్యాయుడు జోక్యం చేసుకున్నారు.

ఇది కాస్త చినికిచినికి గాలివానలా మారి అక్కడ ఉన్న మిగతా ఉపాధ్యాయులు పోలీసుల వరకు వెళ్లాల్సి వచ్చింది. వీరి వివాదంలో పాత కాలం నాటి కొన్ని సంఘటనలు కారణంగా చెబుతున్నారు. గతంలో దాసుపేటలో ఉన్న ఉపాధ్యాయురాలిని అక్కడ హెచ్‌ఎంకు తెలియకుండా ఆకస్మికంగా బదిలీ చేయడం, అనారోగ్యం ఉన్న కె.కొత్తవలస ఉపాధ్యాయుడును దాసుపేటకు బదిలీ చేయడం వంటి విషయాల్లో వీరి మధ్య విబేధాలు నెలకొనడంతో వీరిద్దరి మధ్య రాయడానికి వీల్లేని భాషతో దుర్భాషలాడుకున్నారని అక్కడి వారు పేర్కొంటున్నారు. మరడాం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం జోక్యం చేసుకొని వీరిని సముదాయించారని సమావేశంలో పాల్గొన్నవారు చెబుతున్నారు. ఏమైనా వీరి మధ్య మాటల యుద్ధం రాయడానికి వీల్లేని భాషలో తిట్టుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. 

Advertisement
Advertisement