ప్రభుత్వం చేతుల్లోకి ఆర్టీసీ! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం చేతుల్లోకి ఆర్టీసీ!

Published Sun, Aug 25 2013 8:35 AM

ప్రభుత్వం చేతుల్లోకి ఆర్టీసీ! - Sakshi

ఆర్టీసీని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. విభజన తర్వాత పూర్తిగా నష్టాల్లో కూరుకొని పోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకోవాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) చేసిన విజ్ఞప్తికి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. రాష్ట్ర విభజనకు ముందే ఆర్టీసీ ప్రభుత్వపరం అవుతుంది.

వైద్యం, విద్య తరహాలనే ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ప్రభుత్వం నేరుగా రవాణా సౌకర్యాల కల్పన బాధ్యతను భుజం మీద వేసుకోకుండా ఆర్టీసీని ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేసినా పెత్తనమంతా పరోక్షంగా ప్రభుత్వానిదే. చార్జీల పెంపు మొదలు ఏ రకమైన విధాన నిర్ణయం తీసుకోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆర్టీసీ చైర్మన్, ఎండీ నియామకాలను కూడా ప్రభుత్వమే చూస్తోంది. నష్టాలను మాత్రం సంస్థకే అంటగడుతున్నారు. డీజిల్ ధర పెరిగినప్పుడు నిర్వహణ వ్యయం గణనీయం గా పెరుగుతోంది. ఆ మేరకు చార్జీలు పెంచుకొనే అధికారం ఆర్టీసీకి లేదు. ప్రభుత్వం అనుమతిస్తేనే చార్జీలు పెంచుకోవాల్సి ఉంటుంది. డీజిల్ ధర పెరిగిన వెంటనే చార్జీలు పెంచుకొనే అవకాశం లేకపోవడంతో నష్టాలు పెరుగుతున్నాయి.

ఆర్టీసీ కొంటున్న డీజిల్, బస్సుల విడిభాగాల మీద ప్రభుత్వం ఒక్కపైసా కూడా పన్ను రాయితీ ఇవ్వడం లేదు. డీజిల్, విడిభాగాల మీద వ్యాట్ రూపంలో ఆర్టీసీపై ఏటా రూ.300 కోట్ల భారం పడుతోంది. రూ.450 కోట్ల మేర మోటారు వాహనాల పన్ను చెల్లించాల్సి వస్తోంది. విద్యార్థులు, వయోవృద్ధులకు ఇచ్చే పాసుల రాయితీల భారాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా భరించడం లేదు. బస్సులు కొనడానికి గ్రాంటుల రూపంలో నిధులు ఇవ్వడం మినహా... ఆర్టీసీని ఏ రకంగానూ ఆదుకోవడం లేదు. రుణాలు, నష్టాలు కలిపి ఆర్టీసీపై ప్రస్తుతం రూ.5 వేల కోట్లకుపైగా భారం ఉంది. తమిళనాడు, కర్ణాటకలో ప్రభుత్వమే రవాణా సంస్థలను నడుపుతోంది. కర్ణాటక ఆర్టీసీకి ఆ రాష్ట్ర రవాణా మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీజిల్ ధరలు పెరిగినప్పుడు చార్జీలు పెంచుకొనే అధికారం కర్ణాటక ఆర్టీసీకి ఉంది.

మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వమే నేరుగా ఆర్టీసీని నడిపితే.. సంస్థ ఆస్తులు, అప్పులు ప్రభుత్వానికే చెందుతాయి. ఉద్యోగులకు 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల తరహాలే జీతాలు అందుతాయి. వేతన సవరణ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వమే నేరుగా నిర్వహణ చేపట్టడానికి మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అప్పులను తీర్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement