మద్యం మాఫియా పని పట్టండి | Sakshi
Sakshi News home page

మద్యం మాఫియా పని పట్టండి

Published Wed, Apr 30 2014 12:40 AM

మద్యం మాఫియా పని పట్టండి - Sakshi

లిక్కర్ సిండికేట్ స్కాంలో 34 మంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి
 
ఏసీబీకి గవర్నర్ నరసింహన్ ఆదేశాలు
నిందితుల్లో ఎక్సైజ్, పోలీసు అధికారులు

 
 హైదరాబాద్: రాష్ర్టంలో సంచలనం కలిగించిన లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో పాత్ర ఉన్న 34 మంది అధికారులను విచారించేందుకు గవర్నర్ నరసింహన్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు అనుమతిచ్చారు. ఈ మేరకు మంగళవారం రాజ్‌భవన్ నుంచి ఏసీబీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు సంవత్సరాల క్రితం మద్యం మాఫియా సిండికేట్‌గా మారి తమకు అనుకూలమైన వారికి వైన్‌షాపులను ఇప్పించుకోవడంతోపాటు, ప్రభుత్వాదాయానికి భారీఎత్తున గండికొట్టిన విషయం వెలుగుచూడడం తెలిసిందే. వైన్‌షాపుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుని వస్తుండగా ఏసీబీ అధికారులు ఖమ్మంలో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఈ స్కాం బయటపడింది. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించడంతో ఖమ్మంలో దొరికిన తీగ డొంక విజయనగరంలో కదిలింది. దీని వేర్లు తెలంగాణ, రాయలసీమ, హైదరాబాద్ తేడాలేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయని తెలిసి ఏసీబీ అధికారులే విస్మయం వ్యక్తం చేశారు.
 
మద్యం మాఫియాతో అధికారుల మిలాఖత్

ఖమ్మంలో లిక్కర్ సిండికేటర్ నున్న రమణ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ నెలవారీగా ఎవరెవరికి మామూళ్లు చెల్లిస్తున్న వైనాన్ని బయటపెట్టింది.  ఇందులో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌కు చెందిన కొందరు అధికారులతోపాటు సివిల్ పోలీసు అధికారులు కూడా మిలాఖత్ అయి సిండికేట్ల నుంచి భారీ ఎత్తున దండుకోవడం కూడా బయటపడింది. ఇక విజయనగరంలో అయితే పదిలక్షల నుంచి ముప్పై లక్షల విలువైన వైన్‌షాపులు తెల్లరేషన్‌కార్డుదారుల పేరిట ఉండడం ఏసీబీ అధికారుల దర్యాప్తులో బయటపడింది. వీరిని బినామీలుగా పెట్టి కొందరు రాజకీయ ప్రముఖులు, లిక్కర్ సిండికేట్లు నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ సిండికేట్లతో మిలాఖత్ అయిన ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు ఏసీపీలు, డీఎస్‌పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతోపాటు మరికొందరు పోలీసు అధికారులను కూడా ఏసీబీ అధికారులు అరెస్టుచేసి కేసులు నమోదు చేశారు.
 
అధికారుల బదిలీపై హైకోర్టు అక్షింతలు


 సంచలనాత్మకమైన లిక్కర్ సిండికేట్ కేసు పర్యవేక్షిస్తున్న అధికారుల బదిలీ అంతకంటే ఎక్కువ సంచలనం కలిగించింది. అధికారుల బదిలీపై స్పందించిన హైకోర్టు కేసు దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామంటూ ముందుకు రావడంతో ఈ కుంభకోణం అనేక మలుపులు తిరిగింది. చివరగా కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు పకడ్బందీగా ముందుకు సాగించారు. ఈ నేపథ్యంలోనే తాము అరెస్టుచేసిన ఎక్సైజ్, పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు దాదాపు రెండేళ్లక్రితమే ప్రభుత్వాన్ని కోరారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లభించకపోవడంతో ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించాక ఏకే ఖాన్ మరోసారి లేఖ రాశారు. ఏసీబీ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్ నరసింహన్ ఎట్టకేలకు 34 మంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు. కాగా, ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ నుంచి తమకు ఆదేశ పత్రాలు అందగానే దీనిపై తదుపరి చర్యలకు దిగుతామని ఏసీబీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రాసిక్యూషన్ కోసం పంపిన అధికారులకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని, వారికి సంబంధించిన ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు.    
 

Advertisement
Advertisement