‘ఫార్మసీ’ అక్రమాలపై విచారణకు గవర్నర్ ఆదేశం | Sakshi
Sakshi News home page

‘ఫార్మసీ’ అక్రమాలపై విచారణకు గవర్నర్ ఆదేశం

Published Sun, Feb 8 2015 2:07 AM

‘ఫార్మసీ’ అక్రమాలపై విచారణకు గవర్నర్ ఆదేశం

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న ఫ్మార్మసీ కౌన్సిల్‌లో నెలకొన్న అక్రమాలపై గవర్నర్ నరసింహన్ విచారణకు ఆదేశించారు. ఫార్మసీ కౌన్సిల్‌లో జరుగుతున్న అక్రమాలపై గవర్నర్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఔషధ నియంత్రణ మండలిలో డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌గా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, పదవీ విరమణ చేసిన అధికారిని రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నారని, తక్షణమే ఆయనను తొలగించాలని కొంతమంది ఫార్మసిస్ట్‌లు గవర్నర్‌కు వివరించారు. తమ నుంచి చేస్తున్న అక్రమ వసూళ్లకు తక్షణమే బ్రేక్ పడేలా చూడాలని కూడా వారు ఫిర్యాదులో అభ్యర్థించారు. దీనికి స్పందించిన గవర్నర్.. ఫార్మసీ కౌన్సిల్ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారులుగా ఔషధ నియంత్రణ మండలి డెరైక్టర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి బీఎల్ మీనా, తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ పుట్టా శ్రీనివాస్‌లను నియమించారు.
 
 త్వరలోనే నివేదిక: ఫార్మసీ కౌన్సిల్ అక్రమాలపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని విచారణాధికారి పుట్టా శ్రీనివాస్ తెలిపారు. ఇదిలావుంటే, తనను సాక్షిగా విచారించాలంటూ ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు అన్నపురెడ్డి విజయభాస్కర్‌రెడ్డి విచారణాధికారులకు లేఖ రాశారు. తనను విచారిస్తే మరిన్ని లొసుగులు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. మరోపక్క, కౌన్సిల్‌లో ఎలాంటి అక్రమాలూ జరగలేదని, ఉన్నతాధికారుల అనుమతితోనే రిజిస్ట్రేషన్ క్యాంప్‌లు పెట్టామని రిజిస్ట్రార్ పోలా నాగరాజు ‘సాక్షి’కి చెప్పారు.
 
 ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ల పేరిట డి-ఫార్మసీ, బి-ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి కొందరు వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేశారని ఫార్మాసిస్ట్‌లు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరినుంచి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ వసూళ్లు చేశారని అంటున్నారు. రెన్యువల్ చేసుకోవాల్సి ఉండి, గడువులోగా చేసుకోని వారినుంచి కూడా డబ్బు గుంజారని తెలిపారు. ఇంటివద్దకే రిజిస్ట్రేషన్ పేరుతో పలు పట్టణాల్లో కౌంటర్లు పెట్టి మరీ అభ్యర్థుల నుంచి వసూలు చేశారు. గతంలో ఫార్మసిస్ట్‌ల నుంచి పాలకమండలిని ఎన్నుకున్నా, ఆ సభ్యులెవరికీ కౌన్సిల్‌లో ప్రమేయం లేకుండా చేశారు. దీంతో ఇప్పటికీ అక్రమ వసూళ్లు నడుస్తున్నాయి.
 

Advertisement
Advertisement