తూతూ మంత్రమే ! | Sakshi
Sakshi News home page

తూతూ మంత్రమే !

Published Thu, Jan 9 2014 4:09 AM

తూతూ మంత్రమే !

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన గ్రామసభలు తూతూ మంత్రంగానే ముగిశాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు జిల్లాలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల నిర్వహణలో అధికారులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోగా, గతంలో ఇచ్చిన దరఖాస్తులకు సైతం మోక్షం లే ని ఈ సభలు ఎందుకని నిలదీశారు. దీంతో అధికారులు గ్రామ సభలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు వారిని ఘెరావ్ చేయగా, మరికొన్ని గ్రామాలలో నిర్వహించిన సభలకు అధికారులు కావాలనే వెళ్లలేదు. ఈ సభలకు సంబంధిత అధికారులంతా విధిగా హాజరు కావాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించినా.. అధికారులు వెళ్లకపోవడం గమనార్హం.జిల్లాలో 758 పంచాయతీలకు గాను 25 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జరుగుతోంది. దీంతో మిగిలిన 733 పంచాయతీల్లో సభలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. మిగితా గ్రామాల్లో ఈ నెల 18న ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ సభలకు టెంట్లు, మైక్.. ఇలా భారీగా హంగామా చేసినా స్థానికులు పెద్దగా హాజరు కాకపోవడంతో ప్రజాధనం వృథా అయింది.
 
 సభల నిర్వహణ అస్తవ్యస్తం...
 ఏడాదికి నాలుగు సార్లు గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీరాజ్ కమిషనర్ అదేశాలు జారీ చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, పంచాయతీ విస్తరణ అధికారి ఈ సభలకు హాజరవ్వాలి. అయితే అనేక గ్రామాల్లో సర్పంచ్, ఒకరిద్దరు అధికారులు మినహా ఎవరూ పాల్గొనలేదు. దీంతో సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మరి గ్రామ సభలకు హాజరు కాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకో
 వాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలను జిల్లా అధికారులు ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి.
 
 29 అంశాలపై చర్చ...
 పంచాయతీలకు సంబంధించిన 29 అంశాలపై చర్చించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి అధికారులను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ఈ సభలను నిర్వహిస్తోంది. అయితే ఈ సభల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారుల దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లిన సమస్యలను సైతం పరిష్కరించలేని సభలు ఎందుకని ప్రజల్లో నిరుత్సాహం వ్యక్త మవుతోంది.
 
 గత ఏడాది పాలన నివేదిక, పంచాయతీ వార్షిక లెక్కలు, బడ్జెట్, పన్నులు,ప్రభుత్వ కార్యాక్రమాలు, లబ్ధిదారుల ఎంపిక, తాగునీటి సమస్య, పారిశుధ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థ, వ్యవసాయం, విద్యుత్ సరఫరాతదితర అంశాలపై సభల్లో చర్చించాల్సి ఉంది. కానీ వీటిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, అధికారులు హాజరుకాకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు.
 
 ప్రణాళిక లోపం...
 గ్రామ సభలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. ఈ సభల నిర్వహణ బాధ్యత జిల్లా పంచాయతీ అధికారిది. ఆయా మండల పరిషత్ అధికారులు గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకొని సభ నిర్వహించాల్సి ఉంది. కానీ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సభలు పూర్తిస్థాయిలో జరగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీడీవోలు ఒకటి, రెండు గ్రామాలకు మాత్రమే వెళ్లడంతో మిగితా సభలకు కిందిస్థాయి అధికారులు సైతం కొద్దిమందే హాజరవుతున్నారు. అధికారులు లేని సభలకు వెళ్తే ఒరిగేదేమీ ఉండదనే ఉద్దేశంతో ప్రజలు కూడా హాజరుకాలేదు. ఇలా అధికారుల పర్యవేక్షణ లోపంతో సభలు ఆభాసుపాలయ్యాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి నిర్వహించే సభలకైనా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement