స్వప్నం నిజమయ్యేలా | Sakshi
Sakshi News home page

స్వప్నం నిజమయ్యేలా

Published Sun, Aug 25 2019 7:17 AM

Grama Volunteer Survey On Government Lands In Krishna - Sakshi

సాక్షి, మచిలీపట్నం : అర్హులైన నిరుపేదలకు వచ్చే ఉగాది కల్లా ఇంటి జాగా కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం సాకారం చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. ఇళ్ల స్థలాలకు అనువైన భూముల అన్వేషణ సాగిస్తోంది. మరో వైపు అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించేందుకు గ్రామ, వార్డు వలంటీర్లతో సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇంకా దరఖాస్తు చేయకుండా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారితో కూడా దరఖాస్తులు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

భూముల గుర్తింపునకు కసరత్తు
ఇళ్ల స్థలాల కోసం ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల ఆధారంగా అవసరమైన భూములను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. గడిచిన రెండు నెలలుగా నిర్వహిస్తున్న స్పందనతో పాటు ప్రజాసాధిరాక సర్వే, సోషియో ఎకనామిక్‌ సెన్సెస్, టోల్‌ ఫ్రీ నంబరు 1100 ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల 850 దరఖాస్తులు అందినట్టుగా లెక్క తేల్చారు. ఆ మేరకు వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలంటే కనీసం 2,550 ఎకరాల భూములు అవసరమవుతాయని అంచనా వేశారు. కాగా ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు అనువైన ప్రభుత్వ భూములు జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాలున్నట్టుగా గుర్తించారు. మరో 1550 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. ఇందుకోసం రూ.1500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

రేపటి నుంచి క్షేత్రస్థాయి సర్వే    
ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల నియమితులైన గ్రామ, వార్డు వలంటీర్లతో క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు. 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఈ దరఖాస్తుదారులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు అర్హులా? కాదా? వారిలో ఎవరికైనా ఇళ్ల స్థలం ఉంటి గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారా? లేక కనీసం ఇంటి స్థలం కూడా లేని పరిస్థితి నెలకొందా? అని గుర్తిస్తారు. తమకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఇంకా ఎవరైనా ఇళ్ల స్థలాలు, గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోని వారెవరైనా ఉన్నారా? గుర్తిస్తారు.

తమ వెంట తీసుకెళ్లే ఖాళీ దరఖాస్తులతో వారి వివరాలను నింపి వాటిని తహసీల్దార్‌ కార్యాలయంలో నవరత్నాల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. 31వ తేదీ వరకు ఈ సర్వే జరుగనుంది. సర్వేలో అదనంగా అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకొని అర్హుల తుది జాబితాలను సిద్ధం  చేస్తారు. ఆ మేరకు అవసరమైన భూములపై ఒక అంచనాకొస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను మినహాయించి ఇంకా ఎంత సేకరించాల్సి ఉంటుందో అంచనా వేస్తారు. ఆ మేరకు భూసేకరణకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. తొలి విడతలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తారు. 

Advertisement
Advertisement