సచివాలయ ఉద్యోగాలకు 7 రోజుల పాటు పరీక్షలు | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌1న 12.50 లక్షల మందికి పరీక్ష

Published Tue, Aug 13 2019 12:46 PM

Grama Ward Sachivalayam Jobs Update - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయన్నారు పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌. సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆదివారంతో దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిరిజా శంకర్‌ మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నుట్లు తెలిపారు. 22.73 లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది సిబ్బంది పని చేస్తారని పేర్కొన్నారు. మున్సిపల్‌ శాఖ నుంచే 31 వేల మందిని నియమిస్తున్నామన్నారు.

సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 1 నుంచి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తామని గిరిజా శంకర్‌ తెలిపారు. ప్రశ్నా పత్రాలు రెండు భాషల్లో ఉంటాయన్నారు. టెక్నికల్‌ సబ్జెక్ట్‌ పేపర్లు మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయన్నారు. మొదటి రోజు 12 లక్షల 50 వేల మంది పరీక్ష రాస్తారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీసీటీవీ, వీడియో కవరేజ్‌ పెట్టి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

22 నుంచి హల్‌టికెట్లు: విజయకుమార్‌
పంచాయతీ, మున్సిపల్‌ శాఖలు కలిసి సమన్వయంతో సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ తెలిపారు. ఇప్పటికే పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజ్‌ ఇస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడే నివసించాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రాధాన్యాల ఆధారంగానే గ్రామాలు, వార్డులు కేటాయిస్తామని తెలిపారు. ఈ నెల 22 నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయని.. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుందని తెలిపారు. ప్రతి 4 తప్పు సమాధానాలకు 1 మార్కు నష్టపోతారని వెల్లడించారు. ఎవరైనా పోస్టుల విషయంలో అభ్యర్థులను మోసం చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని విజయ కుమార్‌ హెచ్చరించారు.

Advertisement
Advertisement