పల్లెకు పోదాం | Sakshi
Sakshi News home page

పల్లెకు పోదాం

Published Tue, Oct 29 2013 3:11 AM

Grammy progressive officer

సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామపంచాయతీకో ప్రత్యేక అధికారిని నియమిస్తోంది. ‘గ్రామాభ్యుదయ అధికారి’ పేరుతో వీరిని నియమిస్తున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో గ్రామాన్ని ఒక అధికారికి దత్తత ఇస్తారు. మండలస్థాయి అధికారులకు ఆయూ గ్రామాల బాధ్యతలను అప్పగించనున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం నవంబర్ ఒకటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అన్ని విభాగాల జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్పెషలాఫీసర్లతో సోమవారం రాత్రి కలెక్టర్ కిషన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
 
కలెక్టర్ స్వీయ ఆలోచన

జిల్లాలో మొత్తం 962 గ్రామాలున్నాయి. పంచాయతీ స్థాయిలో వీఆర్‌ఓలు, గ్రామ కార్యదర్శులు ఉన్నప్పటికీ  సొంత విభాగాల విధులకే వారు పరిమితమవుతున్నారు. దీంతో పల్లెపల్లెనా అమలవుతున్న ప్రభుత్వ పథకాలు... వివిధ విభాగాలు చేపడుతున్న అభివృద్ధి పనులపై కనీస పర్యవేక్షణ కొరవడింది. నివేదికలకు... క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన కుదరడం లేదని పలుమార్లు జరిగిన జిల్లాస్థాయి సమీక్ష సమావేశాల్లో తేలిపోయింది. వివిధ పథకాల అమలుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ.. జరుగుతున్న పనులపై సంబంధిత శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్య సాధనలో వెనుకబడిపోతున్నట్లు కలెక్టర్ గుర్తించారు.

ఇటీవల రెవెన్యూ డివిజన్ల వారీగా నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వీయ ఆలోచనతో ప్రత్యేక  కార్యక్రమాన్ని తలపెట్టారు. గ్రామస్థా యి నుంచే మార్పు రావాలని.. అక్కడ పనులు, పథకాలు, ప్ర భుత్వ విభాగాల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ముందడుగు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గ్రా మస్థాయిలో అన్ని శాఖల పనితీరు, అన్ని పథకాల లక్ష్య సాధనను పరిశీలించే బాధ్యతను ఒకే అధికారికి అప్పగిస్తే... లోపాలనుఅధిగమించే వీలుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.

 గ్రామాభ్యుదయ అధికారులు ఏం చేస్తారంటే...

 ప్రతి శుక్రవారం గ్రామాభ్యుదయ అధికారులు గ్రామాలను సందర్శిస్తారు. కార్యదర్శి, వీఆర్‌ఓ, ప్రధానోపాధ్యాయుడు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, ఈజీఎస్ ఫీల్డ్‌అసిస్టెంట్లు, ఐకేపీ సీఏలు, హౌసింగ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, ట్రాన్స్‌కో లైన్‌మెన్ లేదా హెల్పర్, గోపాలమిత్ర, ఆదర్శ రైతు, అంగన్‌వాడీ టీచర్, రేషన్ డీలర్, పింఛన్లు పంపిణీ చేసే అధికారి, ఇతర విభాగాల గ్రామస్థాయి ఉద్యోగులతో సమావేశమవుతారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఉపాధి హామీ పథకం, అంగన్ వాడీ కార్యక్రమాలు, అమ్మహస్తం సరుకుల పంపిణీ, ఇందిరమ్మ గృహ నిర్మాణం, మధ్యాహ్న భోజన పథకం.

గ్రామ పంచాయతీ నిధులు, వివిధ ఇంజినీరింగ్ విభాగాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షిస్తారు. పనుల పురోగతి... లక్ష్యసాధన... సమన్వయలోపం... లోటుపాట్లను అధిగమించే చర్యలపై దృష్టి సారిస్తారు. అక్కడ జరిగిన నిర్ణయాలు, సమావేశం వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ప్రతి గ్రామానికో మెయిల్ ఐడీ కేటాయించి ఈ సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి శనివారం గ్రామాభ్యుదయ అధికారులందరూ మండల కేంద్రంలో సమావేశమవుతారు. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో చర్చిస్తారు. తహసీల్దార్, ఎంపీడీతోపాటు ఎంఈఓ, ఏఓ, ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు ఈ కమిటీలో ఉంటారు.

ఒకవేళ అక్కడ కూడా పరిష్కారానికి నోచుకోని సమస్యలుంటే.. వాటిని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొస్తారు. నెలకోసారి కలెక్టర్ స్థాయిలో ఈ సమావేశం జరుగుతుంది. జిల్లా అధికారులు క్షేత్ర పర్యటనలకు వెళ్లినప్పుడు మార్గమధ్యలో గ్రామాభ్యుదయ అధికారులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విధానంతో సింగిల్ విండో సిస్టమ్ ఏర్పడుతుందని.. ప్రభుత్వ పథకాల పురోగతి మెరుగుపడుతుందని జిల్లా అధికారులు భావిస్తున్నారు.
 

Advertisement
Advertisement