మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో దేవదాసీల క్రీడోత్సవం | Sakshi
Sakshi News home page

మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో దేవదాసీల క్రీడోత్సవం

Published Fri, Oct 18 2013 4:45 PM

నృత్యాలు చేస్తున్న గొరవయ్యలు, (ఇన్‌సెట్లో) కొండపైకి విగ్రహాలను తీసుకెళ్తున్న భక్తులు

దేవరగట్టు భక్తులతో పోటెత్తింది. గొరవయ్యల విన్యాసాలు, దేవదాసీల నృత్యాలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గురువారం ప్రత్యేకం. మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకే గొరువయ్యలు పెద్ద ఎత్తున క్షేత్రానికి చేరుకున్నారు. కర్నూలు జిల్లా నుంచే గాక కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది గొరవయ్యలు తరలివచ్చారు. పిల్లనిగ్రోవి ఊదుతూ, త్రిశూలం చేతబట్టి, ఢమరుకం నాదంతో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.  చెర్నకోలలతో కొట్టుకుంటూ ఉద్వేగంగా వచనాలు చెబుతూ పూనకంతో ఊగిపోయారు. పిల్ల గొరువయ్యలు సైతం  దైవవచనాలు వల్లివేస్తూ అందుకు తగ్గట్టు హావబావాలు ప్రదర్శిస్తూ నృత్యం చేసి భక్తులను ఆశ్చర్యపరిచారు.  
 
ఆలయం కింది భాగంలో ఉన్న మల్లప్ప గుడిలోని సింహాసనం కట్ట ఎదుట హాలహర్వి మండలం బల్లూరు గ్రామానికి చెందిన గాదిలింగ అనే గొరవయ్య స్తంభానికి కట్టిన 20 కేజీల బరువుతో పది అడుగుల పొడవు ఉన్న ఇనుప గొలుసును తెంపే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతిసారి నాలుగు, ఐదు ప్రయత్నాల్లో తెగే గొలుసు సారి 80 ప్రయత్నంలో తెగింది. కొందరు భక్తులు గొరవయ్యకు ఆటంకం కలిగించడమే కారణమైంది. గొలుసు తెంపే కార్యక్రమాన్ని సేకరించేందుకు వెళ్లిన మీడియాపై మద్యం సేవించిన భక్తులు దాడి చేశారు. మీడియా సభ్యులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా వారిని అడ్డుకోలేక పోయారు. దీంతో దీంతో గొలుసు తెంపడానికి పూనుకున్న గొరవయ్య మనస్సు లగ్నం చేయక పోవడంతో 80 సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది.
 
తరలివచ్చిన దేవదాసీలు:

సాయంత్రం మల్లప్పస్వామి గుడి ఆలయ ప్రాంగణం పలు ప్రాంతాల నుంచి వచ్చిన దేవదాసీలు తెల్లటి దుస్తులు ధరించి భక్తితో నృత్యాలు చేశారు. అనంతరం  నెరణికి గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవ విగ్రహాలను కొండపై ఉన్న ఆలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ విగ్రహాలను మోసేందుకు మూడు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఆలయానికి చేరుకున్న విగ్రహాలకు పురోహితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.  
 
నేటితో ఉత్సవాలు ముగింపు :
మాళమల్లేశ్వరస్వామి ఉత్సవాలు శుక్రవారం సాయంత్రంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు, నెరణికిగ్రామ పురోహితుల మధ్య నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు స్వామివారి ఉత్సవ విగ్రహాలను నెరణికి గ్రామానికి మేళతాళాలతో తీసుకెళ్తారు. ఇంతటితో ఉత్సవాలు ముగుస్తాయి.

Advertisement
Advertisement