‘పచ్చ' పాలన! | Sakshi
Sakshi News home page

‘పచ్చ' పాలన!

Published Wed, Sep 24 2014 2:19 AM

Green' rule!

సాక్షి ప్రతినిధి, కడప:
 ఒక పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు ‘ఏ' ఫారం పంపితే, జిల్లా అధ్యక్షుడు ‘బి' ఫారం జారీ చేయడం రాజకీయ పార్టీకి ఉన్న వెసులుబాటు. ఆ మేరకు ఎన్నికల్లో నిబంధనలు వర్తిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాలన అలాగే ఉంది. పింఛన్ కమిటీలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ పార్టీకి ఉన్న వెసులుబాటును ఇన్‌ఛార్జి మంత్రి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ‘ఏ’ ఫారం అనుకుంటే, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పేర్లను ‘బి’ ఫారంగా చేర్చారు. వారు చెప్పినట్లుగా కమిటీలో మెంబర్లను నియమిస్తున్నారు. అదే మంటే ఇన్‌ఛార్జి మంత్రి ఆదేశాలంటూ బుకాయిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల కమిటీల్లో గ్రామ, మండల స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలను నియమించుకుంటూ పచ్చపాలన సాగిస్తున్నారు. ఈ కమిటీలు కొత్తగా పింఛన్లు ఇచ్చేందుకు కాకపోగా ఉన్న పింఛన్లు ఊడగొట్టేందుకే కావడం గమనార్హం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు, వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసి వారి పాలిట పెద్ద కొడుకుగా నిలిచారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్లలో కోత విధిస్తుండటంతో వృద్ధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 ఊడగొట్టేందుకే ప్రాధాన్యత...
 జిల్లాలో 1,24,319 వృద్ధాప్య, 65,078 వితంతు, 16,895 అభయహస్తం, 8,813 చేనేత, 30,603 వికలాంగులు, 21 కల్లు గీత కార్మికులకు కలిపి 2,45,729 పింఛన్లు అందుతున్నాయి. వీరి కోసం ప్రభుత్వం రూ.6.951 కోట్లు ప్రతినెలా భరిస్తోంది. అయితే ఆక్టోబర్ 2 నుంచి రూ.1000 పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఇంతకాలం పింఛన్ అందుకున్న వృద్ధులు ఆనందించారు. పింఛన్ పొందుతున్నవారు అర్హులా? అనర్హులా అంటూ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పారదర్శకతతో కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అనుచరులకే ప్రాధాన్యతనిస్తున్నారు. పైగా కొత్తగా అర్హులకు పింఛన్లు ఇచ్చేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. పింఛన్ దరఖాస్తులు తీసుకునేందుకు మాత్రమే అనుమతించారు. ఉన్న వాటిలో కొన్నింటిని తొలగించి ఆ స్థానంలో కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారికి ఇవ్వాల్సిన స్థితిని అధికారులకు కల్పిస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్ని పింఛన్ దారులుగా చేర్చుకునేందుకు ప్రస్తుతం ఉన్న పింఛన్లు కొన్నింటినైనా తొలగించాలి. అందుకోసం కమిటీల్లో తెలుగుతమ్ముళ్లు అధికంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాజిక కార్యకర్తలుగా టీడీపీ రౌడీషీటర్లు సైతం జాబితాలో చేరుతున్నారు.
 కమిటీల్లో లోపించిన చిత్తశుద్ధి...
 తెలుగుదేశం ప్రభుత్వం ఏపని చేపట్టినా స్వకార్యాన్నే బేరీజు వేస్తోంది. పింఛన్ల కమిటీలో పారదర్శకతకు తిలోదకాలిచ్చింది. గ్రామ స్థాయిలో సామాజిక కార్యకర్తలుగా తెలుగుతమ్ముళ్లు వచ్చి చేరారు. అసాంఘిక శక్తులుగా గుర్తింపు పొందినా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆదేశాలు ఉంటే చేరిపోయారు. మండల స్థాయిలో ఇరువురు సర్పంచ్‌లు, ఇరువురు ఎంపీటీసీలను ఇన్‌ఛార్జి మంత్రి ఎంపిక చేయాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నలుగురు లేని చోట ఖాళీగానే అసంపూర్తిగా కమిటీలను నియమిస్తున్నారు. అందుకు కారణం ఎదుటి పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధి జాబితాలో చేరుతారనే ఉద్దేశం అధికార పార్టీకి కన్పిస్తోంది. నలుగుర్ని కూడా మంత్రి సిఫార్సులు లేకపోయినా టీడీపీ ఇన్‌ఛార్జి సూచించిన వారిని చేరుస్తూ పచ్చపాలన సాగిస్తున్నారు. తెలుగుదేశాధీశుల పాలనలో కొత్తగా పింఛన్లు దక్కకపోగా మరొకరి పింఛన్ ఊడగొట్టి ఇంకొకరికి ఇవ్వాల్సిన దుస్థితి కల్గుతోంది.



 

Advertisement
Advertisement