Sakshi News home page

కుక్క కరిస్తే గుంటూరు పంపిస్తారా?

Published Mon, Dec 22 2014 1:42 AM

కుక్క కరిస్తే గుంటూరు పంపిస్తారా? - Sakshi

పభుత్వాస్పత్రి వైద్యులపై మంత్రి కామినేని సీరియస్
బాధ్యులను సస్పెండ్ చేస్తాం

 
 విద్యాధరపురం కబేళా రోడ్డులోని రోటరీనగర్‌లో ఆదివారం ఉదయం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేసి గాయ  పరిచాయి. ఆ బాలుడిని తల్లిదండ్రులు ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, వ్యాక్సిన్ లేదని గుంటూరుకు రెఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ లేకపోతే మేమేం చేయగలమని డెప్యూటీ ఆర్‌ఎంవో సమాధానమిచ్చారు.
 
లబ్బీపేట : ‘కుక్క కరిచి ఆస్పత్రికి వచ్చిన బాలుడికి టీకా వేయమంటే గుంటూరు వెళ్లమంటారా.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా.. ఇక ఉపేక్షించేది లేదు, తక్షణమే బాధ్యులైన వైద్యుడిని సస్పెండ్ చేస్తా. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటించినా, తాను తనిఖీలు చేసినా వైద్యులు, సిబ్బందిలో మార్పు రావడం లేదంటూ ఆసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో వైద్యులు వివరణ ఇస్తుండగా, అవేమి పట్టించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. నగరంలోని కబేళా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి శ్యామ్ కుక్కకాటుకు గురవడంతో ఉదయం 7.24 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడు బాలుడిని పరీక్షించి ఏఆర్‌వీ, టీటీ ఇవ్వడంతో పాటు, యాంటిబయోటిక్ ఇచ్చారు. చిన్న వయస్సు కావడంతో ఇమ్యునోగ్లోబలిన్ ఇంజక్షన్ ఇస్తే మంచిదని తమ వద్దకు లేవని చెపుతూ, గుంటూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ విషయం ఆస్పత్రి సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడిపై విరుచుకుపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా మీ తీరులో మార్పు రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు, వెంటనే సంబంధిత వైద్యుడ్ని సస్పెండ్ చేసేందుకు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఊపేక్షించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వేటే అనే సంకేతాల వైద్యులు,  సిబ్బందికి వెళ్లేలా మంత్రి ఆయన వ్యవహరించారు. కాగా మంత్రి స్వయంగా ఆదేశించడంతో బాలుడికి అవసరమైన ఇమ్యునోగ్లోబలిన్ కోసం గుంటూరు సీడీఎస్‌లో ప్రయత్నించారు. అక్కడ కూడా లేకపోవడంతో మచిలీపట్నంలోని ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న ఒక్క ఇంజక్షన్ తీసుకొచ్చి బాలుడికి చేశారు.

డీఎంఈకి నివేదిక

కుక్కకాటు వాక్సిన్ వేయడంలో నిర్లక్ష్యం వహిం చిన వైద్యుడిని సస్పెండ్ చేయాలంటూ మంత్రి ఆదేశించిన నేపథ్యంలో జరిగిన విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి రాష్ట్ర వైద్య విద్యా సంచాలకునికి వివరించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల ఆధారంగా వైద్యుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా ప్రాథమికంగా వైద్యుడు తప్పులేదని, ప్రభుత్వం నుంచి ఇంజక్షన్ల సరఫరా లేకనే సమస్య తలెత్తినట్లు నిర్ధారించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం.
 
 కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
 
భవానీపురం : విద్యాధరపురం కబేళా రోడ్‌లోని రోటరీన గర్‌లో కుక్కల మూకుమ్మడి దాడిలో ఒక బాలుడు తీవ్రగాయాలపాల య్యాడు. స్థానిక విద్యార్థి చొరవతో బాలుడు  ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆది వారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన నగరవ్యాప్తంగా కలకలంరేపింది. కుక్కల స్వైర విహారం చేస్తున్నా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒళ్లంతా రక్తంతో ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. వివరాలిలా ఉన్నాయి. భవానీపురం చర్చి సెంటర్‌లోని కొబ్బరి బొండాల విక్రయదారుని వద్ద పనిచేసే గుడిసె పౌల్‌రాజు, మరియమ్మ దంపతులు రోటరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్నవాడైన శ్యామ్(5) లేబర్‌కాలనీలోని జీఎన్నార్ ఎలిమెంటరీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. పౌల్‌రాజు ఇంటిలోని మరుగుదొడ్డి పాడైపోవడంతో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు బహిర్భూమికి బయటకు వెళుతున్నారు. ఈ క్రమం లో ఆదివారం ఉద యం 6.30 గం టల ప్రాంతంలో శ్యామ్ ఒంటరిగా ఇంటికి సమీపంలోని ఖాళీ ప్రదేశానికి బహిర్భూమికి వెళ్లాడు. దీంతో స్థానికంగా ఉండే 5 కుక్కలు ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

దీంతో భయపడిపోయిన బాలు డు ఏడ్వటం ప్రారంభించాడు. పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్‌లోని ఎం.రాధాకృష్ణ అనే విద్యార్ధి చూసి కేకలు వేసేసరికి కుక్కలు ఆ బాలుడిని కొద్ది దూరం ఈడ్చుకువెళ్లి మళ్లీ కరవడం ప్రారంభించాయి. దీంతో రాధాకృష్ణ దూరం నుంచి రాళ్లు విసరడంతో బాలుడి వదిలేసి వెళ్లిపోయాయి. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు  వచ్చి బాలుడిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  బాలుడి కుటుం బాన్ని సీపీఎం నగర కార్యదర్శి సిహెచ్. బాబూరావు, కార్పొరేటర్ బట్టిపాటి సంధ్యారాణి, బట్టిపాటి శివ పరామర్శించారు.
 
 కొద్ది సేపుంటే చీల్చి చెండాడేవి

 బాలుడిపై కుక్కల దాడిని చూస్తుంటే సినిమాలో భయానక సన్నివేశంలా ఉంది. నేను చూడకపోతే బాలుడిని చీల్చి చెండాడేవి. హాస్టల్‌లో ఉండగా పిల్లవాడి ఏడుపు వినిపించి బయటకు వచ్చి చూశాను. అప్పటికే ఐదు కుక్కలు  ఇష్టం వచ్చినట్లు బాలుడిని కరుస్తున్నాయి. నన్ను చూసి బాలుడిని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న ఖాళీ స్ధలంలోకి తీసుకువెళ్లి పడేశాయి. ఒక కుక్క బాలుడి గుండెలపెకైక్కి మెడపై కొరుకుతుంది, వెంటనే రాళ్లు తీసుకుని విసిరేసేసరికి పారిపోయాయి. ఆ సంఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ బాలుడు ఎలా భరించాడో భగవంతుడికే తెలియాలి. బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది.
 - ఎం. రాధాకృష్ణ,
 ప్రత్యక్ష సాక్షి, కేబీఎన్ కళాశాల విద్యార్థి
 
 మందు లేనిదే ఏం చేస్తాం

 కుక్కకాటుకు గురైన వారికి అయిన గాయాన్ని బట్టి ఏఆర్‌వీ వాక్సిన్‌తో పాటు, మరింత రక్షణ కోసం ఇమ్యునోగ్లోబలిన్ ఇంజక్షన్ ఇస్తాం. ఆ ఇంజక్షన్లు ప్రభుత్వాస్పత్రిలో 20 రోజుల కిందట అయిపోయాయి. సెంట్రల్ డ్రగ్స్‌స్టోర్‌కు ఇండెట్ పెట్టినా స్టాకు లేకపోవడంతో రాలేదు. స్థానికంగా కొనాలని ప్రయత్నించినా హోల్‌సేల్ డీలర్ల వద్ద అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో బాలుడి మెడకు గాయమైనందున గుంటూరులో అందుబాటులో ఉంటే చేస్తారనే ఉద్దేశంతో రిఫర్ చేశారు. అంతేకానీ ఎఆర్‌వీ ఇవ్వడంలో ఆలస్యం చేయలేదు. బాలుడు వచ్చిన వెంటనే ఏఆర్‌వి, టీటీ, ఓవెరాన్ ఇచ్చారు.
 - డాక్టర్ ఐ.రమేష్, డిప్యూటీ ఆర్‌ఎంఓ
 

Advertisement
Advertisement