Sakshi News home page

కోలాహలంగా ఏడు గంగల జాతర

Published Thu, Dec 12 2013 4:04 AM

Hand-seven gangala fair

=ఆకట్టుకున్న గంగమ్మ అలంకరణలు
 =ప్రత్యేక ప్రభలలో ఊరేగింపులు
 =అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
 =భారీ పోలీసు బందోబస్తు

 
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం ఏడు గంగల జాతర కోలాహలంగా జరిగింది. విద్యుత్ దీపాలంకరణ లు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తిలో ఒకేరోజు ఏడు గంగమ్మలతో జాతర జరగడం విశేషం.  జాతర కమిటీ సభ్యులు అలంకరించిన చప్పరాలు మంగళవారం రాత్రి ముత్యాలమ్మ గుడివీధిలో ఉన్న గంగమ్మ ఆల యానికి చేరుకున్నాయి. పూజారులు అమ్మవారికి కుంభం వేసి అభిషేకాలు చేశారు. ఆ తర్వాత గంగమ్మలు బయలుదేరాయి. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. మా మూలుగా సూర్యోదయానికి ముందే గంగమ్మలు రావాల్సి ఉంది. అయితే బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో నిర్దేశించిన ప్రాంతాలకు చేరుకున్నాయి.
 
వేలాదిగా తరలివచ్చిన భక్తులు

ఉదయం నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి గంగమ్మలను దర్శించుకున్నారు. నిర్వాహకులు పోటీలు పడి గంగమ్మలను అలంకరించారు. కులమతాలకు అతీతంగా ప్రజ లు గంగమ్మలను దర్శించుకోవడం విశేషం. సాయంత్రం వరకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ సులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోకి భారీ వాహనాలు, బస్సులు రాకుండా బైపాస్‌రోడ్డు ద్వారా మళ్లించారు. అయితే భక్తులు బైపాస్‌రోడ్డు నుంచి ఆలయానికి చేరుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డారు.
 
వివిధ రూపాల్లో అలంకరణలు

ఏడు గంగమ్మలను వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంలోని పెండ్లిమండపం వద్ద పొన్నాల మ్మకు (పెద్దక్క) అభయవైష్టవిదేవి అలంకరణ, ఊరేగింపునకు పద్మవైకుంఠప్రభ (చప్పరం)తయారు చేశారు. అలాగే బేరివారిమండపం వద్ద ముత్యాలమ్మకు ధనలక్ష్మి అలంకరణ, శ్రీకృష్ణ జగన్నాథ ప్రభ, పూసలవీధి కావమ్మకు భవానీదేవి అలంకరణ, పుష్పప్రభ, సన్నిధివీధిలోని అంకాళమ్మకు గౌరీభవాని అలంకరణ, శివనాగదేవత పంచప్రభ, తేరువీధిలో నల్లగంగమ్మకు అంబికాదేవి అలంకరణ, సూర్యదేవత మణిమండప ప్రభ, గాంధీవీధి అంకమ్మకు గాయత్రిదేవి అలంకరణ, సప్తశక్తి విశ్వరూపప్రభ, కొత్తపేటలోని భువనేశ్వరి అమ్మవారికి రేణుకాంబదేవి అలంకరణ, ఆదిశేష ప్రభను తయారుచేశారు. అమ్మవారి ఊరేగింపు ముందు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో పట్టణమంతా కోలాహలంగా కనింపించింది.
 

Advertisement
Advertisement