అత్తమామలే కాలయములు | Sakshi
Sakshi News home page

అత్తమామలే కాలయములు

Published Thu, Feb 19 2015 1:05 AM

అత్తమామలే కాలయములు - Sakshi

అత్తమామల వేధింపుల కారణంగా ఇద్దరు తోడికోడళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏడు నెలల క్రితమే కోటి ఆశలతో అత్తవారి ఇంట అడుగుపెట్టిన ఈ ఇద్దరూ గర్భం దాల్చిన కొద్దిరోజులకే అర్ధాంతరంగా తనువుచాలించడం అందరినీ కలచివేసింది. బుద్దవరం శివారు రాజీవ్‌నగర్‌కాలనీలో ఈ విషాధ ఘటన చోటుచేసుకుంది.
 
గన్నవరం : అత్తింటివారి వేధింపులకు ఒకే కుటుంబంలోని ఇద్దరూ తోడికోడళ్లు బలైపోయారు. వివాహం అనంతరం కోటి ఆశలతో మెట్టినింటికి వచ్చిన వారిని సొంత కూతుళ్ల వలే సాకవలసిన అత్తమామలే వారి పాలిట కాలయముల య్యారు. నిత్యం వారిని మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. వీరి వేధింపులు తాళలేక, పుట్టింటి వారికి చెప్పుకున్నా ప్రయోజనం లేక, భర్తల సానుభూతి లేక, ఏడు నెలల వివాహ జీవితాన్ని ముగించుకుని గర్భిణులుగానే వారిద్దరూ తనువులు చాలించారు. ఇంటి దూలానికి ఉరివేసుకుని అనుమానాస్పద స్ధితిలో కలిసి మృతి చెందడం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని బుద్దవరం శివారు రాజీవ్‌నగర్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది.

ప్రేమించి పెళ్లిచేసుకుని...

రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన మురళీ రమణమ్మ(20)ను బంధువైన అదే ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నక్కా రాం బాబు గత ఏడాది మే నెలలో ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నాడు. అతడి సోదరుడైన శివ కూడా మరో వారం వ్యవధిలోనే అదే కాలనీకి చెందిన ఝాన్సీ(19)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహ అనంతరం కొంతకాలం పాటు వీరితో అత్తమామలు భూలక్ష్మి, వెంకటేశ్వరరావు కలిసి ఉన్నారు.

వేధింపులే ఉసురు తీశాయి..

వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చినప్పటికి ఒకే ఇంటిలో కాపురం ఉంటున్న రమణమ్మ, ఝాన్సీ సొంత అక్కాచెల్లెలు మాదిరిగా కలిసిమెలసి ఉంటున్నారు. దీనిని చూసి ఓర్వలేని అత్తమామలు వీరిపై అక్కసు పెంచుకున్నారు. గర్భిణులనే కనికరం కూడా లేకుండా వీరిని చీటికీమాటికీ మాటికీ దూషిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై భర్తలకు చెప్పినప్పటికి అత్తమామలు చెప్పినట్లు సర్దుకుపొమ్మని నచ్చజెప్పారు. కోడళ్లను వేధించవద్దని రెండు కుటుంబాల వారు, పెద్దలు కూడా పలుమార్లు వెంకటేశ్వరరావు దంపతులకు చెప్పా రు. వారు ఆ మాటలను పెడచెవిన పెట్టి కోడళ్లను మరింతగా వేధించసాగారు.

మానసికంగా కుంగిపోయి

అత్తమామలు నిత్యం వేధిస్తుండటాన్ని తోడికోడళ్లు తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అత్తమామలతో చోటు చేసుకున్న వివాదం కారణంగా సమీపంలోని రమణమ్మ పుట్టిం టికి వెళ్లిపోయారు. అయితే వీరిద్దరి కుటుంబ సభ్యులు ఓదార్చి తిరిగి అత్తిం టికి తీసుకువచ్చి అప్పగించారు. చెప్పపెట్టకుండా పుట్టింటికి వెళ్లడంపై వీరిని అత్తమామలు మానసికంగా మరింత చిత్రహింసలకు గురిచేశారు.

పెళ్లిఫొటోలు చూసుకుని..

అత్తింటి వేధింపులు తాళలేక తోడికోడళ్లు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. వీరు ఉరివేసుకుని ఉన్న గదిలో వీరి పెళ్లిఫొటోలు పడి ఉం డడం కనిపించింది. ఈ ఘటన జరగక ముందు చివరిసారిగా పెళ్లిఫొటోలు చూసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఇరువురు పక్కపక్కనే ఇంటి దూలానికి ఓణీలతో ఉరివేసుకుని  మృతి చెంది ఉండడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై మృతుల పుట్టింటివారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
కాలనీలో విషాదం..

తోడికోడళ్ల మృతితో కాలనీలో విషాదం నెలకొంది. రమణమ్మ మృతదేహం వద్ద తల్లి ఏసు మరియమ్మ, తల్లి లేని ఝాన్సి భౌతికకాయం వద్ద ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
 

Advertisement
Advertisement