అవి బోగస్ రాజీనామా పత్రాలు | Sakshi
Sakshi News home page

అవి బోగస్ రాజీనామా పత్రాలు

Published Tue, Sep 3 2013 3:22 AM

అవి బోగస్ రాజీనామా పత్రాలు - Sakshi

సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎంపీలు చేసిన రాజీనామాలన్నీ డ్రామాలేననే విషయం మరోసారి స్పష్టమైంది. పార్టీ ఎంపీలు సమర్పించిన రాజీనామాలు నిబంధనల ప్రకారం లేవని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ అసలు విషయం బయటపెట్టారు. పదవులకు రాజీనామా చేయాలని చెప్పి పార్టీ కార్యాలయం నుంచి కొన్ని పత్రాలు పంపించారని, వాటిపై తాను సంతకం చేసి రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో అందజేసినా రాజీనామా ఆమోదం పొందలేదన్నారు. దీనిపై ఆరా తీస్తే రాజీనామా పత్రాలు నిబంధనల మేరకు లేవనే విషయం వెల్లడైందన్నారు. సోమవారం హరికృష్ణ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజీనామాల విషయాన్ని వివరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తున్నారని, మీరు కూడా చేయండని కోరుతూ ఎన్టీఆర్ భవన్ నుంచి తనకు ఓ పత్రం అందిందన్నారు. దానిపై సంతకం చేసి రాజ్యసభ చైర్మన్‌కు అందచేశాక వారం రోజులు గడిచినా ఎలాంటి స్పందనా కనిపించలేదన్నారు.
 
తానే స్వయంగా వెళ్లి వాకబు చేయగా పార్టీ పంపిన రాజీనామా పత్రంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను సభలో ప్రవేశ పెట్టనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారని, ఇలాంటివి పొందు పరిస్తే తాము ఆమోదించలేమని చెప్పారని హరికృష్ణ వివరించారు. ఈ కారణంగానే తాను స్వయంగా మరో రాజీనామా లేఖను రాసిచ్చానని తెలిపారు. ఈ పత్రాన్ని స్వీకరించినవెంటనే రాజ్యసభ చైర్మన్ ఆమోదించారన్నారు. తెలుగు ప్రజలను వంచించకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని ఉద్ఘాటించారు. తన రాజీనామా అంశాన్ని పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తప్పుబట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను, నా కుమారుడు(జూనియర్ ఎన్టీఆర్) ఎన్నిసార్లు శీల పరీక్ష చేసుకోవాలని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం సరికాదని 2009 ఎన్నికలకు ముందే చంద్రబాబుకు చెప్పానన్నారు.
 
 అందుకే పెళ్లికి వెళ్లలేదు..
తన రాజీనామా ఆమోదం విషయంలో సందిగ్ధత నెలకొనడంతోనే బాలకృష్ణ కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయానని హరికృష్ణ చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగ, జేఏసీ నేతలతో సమన్వయం చేసుకున్న తర్వాత కృష్ణాజిల్లా నిమ్మకూరు నుంచి యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని చెప్పారు.

Advertisement
Advertisement