‘మనసుల్నె ఉన్నడు.. మర్చిపోతమా’! | Sakshi
Sakshi News home page

‘మనసుల్నె ఉన్నడు.. మర్చిపోతమా’!

Published Tue, May 27 2014 3:52 PM

కాళోజీ నారాయణరావు, రుక్మిణి (ఫైల్)

‘మనకాళోజీ’లో రుక్మిణి కాళోజీ అంతరంగ ఆవిష్కరణ

 కాళోజీ. కాళన్న. మన కాళోజీ. ఇదీ మూడు ముక్కల్లో కాళోజీ నారాయణరావు జీవితం. ఆర్యసమాజీకుడు, గాంధేయవాది, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు, నైతిక వామపక్ష వాది అయిన కాళోజీ నారాయణరావు (1914- 2002) ప్రజాస్వామ్యంలో అత్యుత్తమ హోదా పౌరుడేనని అభివర్ణించేవారు. తన రక్తనాళ స్పందనను పౌరుడి ‘నాగొడవ’గా విన్పించారు. ‘ప్రమాదం దగ్గరకు కోరి పోలేదు, ప్రమాదం ఎదురైతే పారిపోలేదు’ అనగలిగిన ధీరుడు. కాళోజీ సామాజిక జీవితం అందరికీ సుపరిచితమే. కుటుంబజీవితం?

 స్ఫటికంలా స్పష్టంగా మాట్లాడడంలో కాళోజీకి సరిజోడు దివంగత రుక్మిణీ కాళోజీ. మంగళవారం సాయంత్రం సాలార్‌జంగ్ మ్యూజియంలో విడుదలకానున్న ‘మన కాళోజీ’ డీవీడీ నుంచి ముచ్చటగొలిపే రుక్మిణమ్మ పలుకులు...
 
 ‘అన్న తర్వాత ఇరవయ్యేళ్లకు పుట్టిన. చిన్నదాన్ని. మా మేనమామ దగ్గర చదువుకునేందుకు కాళోజీ ఇంటికొచ్చేవాడు. నాయన సంస్కృత పండితుడు. తెలియనివి అడిగేది. తెల్సుకునెటోడు. నాకు చదువు చెప్తనని చెవులు పిండెటోడు. నాకు ఎక్కాలు రాకుంటుండె. ఒకరోజు, మా మేనమామ కాళోజీని గురుదక్షిణ ఇయ్యమన్నడంట. ఏందంటె మేనకోడలిని చేసుకో అన్నడు. సరె పిల్లను చూస్తనన్నడు. రోజూ చూస్తున్నవ్ కదా అంటే, అది వేరన్నడంట. ఒక రోజొచ్చిండు. చూసిండు. పోయిండు. ఏమి చెప్పలే. నాలుగు రోజుల తర్వాత సరేనన్నడంట. పెండ్లి చేసుకుంటె పోషించటం ఎట్ల అనె కాళోజీ చింతను అన్న తీర్చిండు. నిన్ను చూసుకున్నట్లె కుటుంబాన్నీ చూసుకుంటనన్నడు వాళ్లన్న రామేశ్వరరావు.  
 
 తీస్కపోయినోడు పెట్టడా?
 మా ఇంట్ల కాళోజీ మాములుగనే ఉండేది. పెండ్లయింది (కాళోజీ 26 రుక్మిణి 13). వాళ్లింట్ల అందరు పెద్దోళ్లేనాయ. బావ రామేశ్వరరావు, తోటి కోడలు, అత్త, అందరు పెద్దోళ్లేనాయ. ఈయన ఎవ్వరితోని మాట్లాడేది కాదు. అన్నతో మాట్లాడేది. దోస్తులతో. నాతోకూడా మాట్లాడేది కాదు. ఇంట్ల అంటి ముట్టనట్టుండేది. టిఫిన్ రెడి అయితెనే  మొకం కడిగేది. నీళ్లు సిద్ధంగుంచాలె. రజాకార్లప్పుడు జైలుకు పోయిండు. జైలుకు టిఫిన్లు పంపుతుండేది. ఒక రోజు టిఫిన్ వాపసొచ్చింది. ఏందంటే, ఆయన్ను వరంగల్ నుంచి గుల్బర్గ జైలుకు పంపిన్రంట. తెలంగాణ ఉద్యమప్పుడు (1969) ఎస్.పి ఇంటికొచ్చిండు. అరెస్టు చేస్తానన్నడు. ‘నువ్వేంది అరెస్ట్ చేసేది నేనె వస్తున్న, పా’ అన్నడు. ఒంటి మీన బట్టల్తోనే బయటకు దారితీసిండు. ఏమన్న తీస్కపో, తినటానికి అంటె ‘తీస్కపోయినోడు పెట్టడా’ అన్నడు.
 
 ఘంటసాల క్యాంపు..
  ఆయనకు మనసు బాగలేకపోతె ఎవ్వరిమీదైనా బాగ కోపమొస్తె కృష్ణాజిల్లాలోని ఘంటసాలకు పోయెటోడు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య ఇంట్ల నెలలు నెలలు ఉండెటోడు. కార్డన్న రాయాల్నా? రాయడు!  వెంకటసుబ్బయ్యే రాసేది. తమ్ముడు కాళోజీ నా దగ్గరున్నడు దిగులు పడకండి అని. ఇక్కడికొచ్చేది. రోజూ కార్డెమ్మటి కార్డు రాసేది. కాశీ, రామేశ్వరం, ఢిల్లీ, తిరపతి తీసుకెల్లిండు. యాడకు పోయినా ఆయన తీరు మారదు. తిరపతికొచ్చి కొండెక్కలే. నేనె దర్శనం చేసుకున్న.

 పద్మవిభూషణ్ ఇచ్చేముందు ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈయనను ముందే అడిగిండు. ‘మొండోడు కదా. వాడిస్తనంటె ఎందుకు వద్దనాలె, నేనడిగిన్నా’ అన్నడు. అవార్డు తీసుకునేందుకు ఢిల్లీ ఒక్కణ్ణె పోతానన్నడు. నేనూ వస్తనని పట్టుపట్టి పోయినా. షష్టిపూర్తి నుంచి గడ్డం పెంచుకోవడం మొదలు పెట్టిండు. అంతకు ముందు లేదు. గడ్డం పెంచుకోకముందే బాగుండేవాడు. ఆ సంగతి చెప్పలే. చెప్తే ఇంటడా? ఆయనంటె నాకు ప్రేమలేదా? ఉందని ఆయన నాకు చెప్పలేదు. నేను ఆయనకు చెప్పలేదు. చెప్పాల్నా? ఆయన పండుకున్న మంచంలోనే పండ్తున్న. మనిషి ఎప్పుడు గుర్తే వస్తడు. మనసుల్నె ఉన్నడు గదా. మర్చిపోతనా!
 
 - పున్నా కృష్ణమూర్తి (సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్)

Advertisement

తప్పక చదవండి

Advertisement