Sakshi News home page

చిన్నారికి పెద్ద కష్టం..!

Published Mon, Jun 16 2014 1:52 AM

చిన్నారికి పెద్ద కష్టం..! - Sakshi

 డోన్ రూరల్:  ఆ పసిబాలుడికి పెద్ద కష్టమొచ్చింది. ఏడు నెలలు నిండని వయసులో విధిని ఎదిరించి పోరాటం చేస్తున్నాడు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. డోన్ మండలం యు. కొత్తపల్లె గ్రామానికి చెందిన జరీనాకు అదే గ్రామానికి చెందిన హుసేన్‌బాషాతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయినా మూడేళ్ల తర్వాత ఆమెకు మగపిల్లాడు పుట్టాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
 
అయితే వారిని విధి చిన్నచూపు చూసింది. ఏడునెలల ఇమ్రాన్‌కు అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చూపించారు. చిన్నారిని పరిశీలించిన వైద్యులు చిన్నారికి కాలేయ వ్యాధి ఉందని చెప్పారు. దీంతో వారు జబ్బు నయం కోసం రూ. 3 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా నయం కాలేదు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో, కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారిని చూపించగా రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. ఈ ఆపరేషన్ కూడా 16 రోజులలోనే చేయాలని వైద్యులు చెప్పారు.
 
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు:
హుసేన్‌బాషా, జరీనాలది నిరుపేద కుటుంబం. కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడి జబ్బు నయం కోసం అందిన చోటల్లా అప్పులు చేశారు. అయినా జబ్బు నయం కాలేదు. అయితే ఇప్పుడు రూ. 30 లక్షలు అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిగా తయారైంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెప్పడంతో వారికి దిక్కుతోచడం లేదు. మూడేళ్లతర్వాత పుట్టిన కుమారుడిని రక్షించుకోలేక ఆత ల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తన కుమారుడిని రక్షిస్తే జీవితాంతం వారికి రుణపడి ఉంటామని ఆ తల్లిదండ్రులు కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలెవరైనా ఉంటే సెల్: 9959277796కు ఫోన్ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement