హృదయవిదారక ఘటన.. కన్నీళ్లు ఆపతరమా? | Sakshi
Sakshi News home page

హృదయవిదారక ఘటన

Published Tue, Sep 10 2019 10:54 AM

Heart Touching Incident in Chittoor District - Sakshi

సృష్టిలో అమ్మను మించిన వారు లేరు. ఆజన్మాంతం కన్నబిడ్డలపై ప్రేమానురాగాలు కురిపిస్తూ కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ. మనుషులకైనా, మూగ ప్రాణులకైనా అమ్మ ప్రేమ ఒకటే. ప్రాణం పోతున్నా తన బిడ్డల కోసమే తల్లి ఆలోచిస్తోంది. అలాంటి సంఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.

గంగవరం (చిత్తూరు జిల్లా): ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయినా.. లేగదూడ ఆకలి తీర్చింది ఓ గోమాత. ఈ హృదయవిదారకమైన ఘటన గంగవరం మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గాంధీనగర్‌ గ్రామ సమీప పొలాల వద్ద క్రిష్ణమూర్తి, లక్ష్మీనారాయణ అనే రైతులు తమ పశువులను రాత్రివేళలో గొడ్లపాకలో కట్టేసేవారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో అటవీ ప్రాంతంలోని పొలాల మీదుగా వచ్చిన ఏనుగులు గొడ్లపాకలో ఉన్న ఆవు, దూడలపై దాడి చేశాయి. ఏనుగు తొండంతో దూడను తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆవు నడుము విరిగిపోవడంతో అక్కడి నుంచి లేవలేని స్థితికి చేరుకుంది. ఆ బాధను తట్టుకోలేక సోమవారం ఉదయం మరణించింది. ఆ విషయం తెలియని నెలన్నర వయస్సున్న లేగదూడ పాల కోసం తాపత్రయపడింది. కాసేపు తల్లి ఆవు వద్ద పాలు తాగి ఆకలి తీర్చుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు. 


ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆవు

Advertisement
Advertisement