చివరిలో చినుకుపోటు | Sakshi
Sakshi News home page

చివరిలో చినుకుపోటు

Published Mon, Mar 3 2014 4:05 AM

heavy losses to farmers due to untimely rains

డోన్, న్యూస్‌లైన్ : చివరి దశలో ఉన్న పంటలపై అకాల వర్షం ప్రతాపం చూపి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రధానంగా మామిడి, అరటి, వరి, మిరప పంటలకు నష్టం తీవ్రత అధికంగా ఉంది. డోన్ డివిజన్‌లో శనివారం రాత్రి సంభవించిన గాలి, వాన కారణంగా జలదుర్గం, కొమ్మెమర్రి, కన్నపుకుంట, ఊటకొండ, ఎంబాయి, కొత్తకోట తదితర గ్రామాల పరిధిలో సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోటి రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచన.

 వరి, అరటి పంట నేలవాలగా మామిడి చెట్లపై పూత, పిందె రాలిపోయింది. గాలి కారణంగా గుడిసెల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఆయా గ్రామాలు అంధకారంలో మగ్గిపోయాయి. కరెంటు లేకపోవడంతో ఆయా గ్రామాల వాసులు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. గాలుల కారణంగా 40ఎకరాల్లో అరటి పంట నాశనమైంది. మరో పది, పదిహేను రోజుల్లో కోత కోసేందుకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలడంతో సుమారు రూ.20లక్షలు నష్టపోయినట్లు జీవనమూర్తి అనే రైతు వాపోయాడు. డోన్,వెల్దుర్తి, ప్యాపిలి మండలాల పరిధిలో మామిడి పంటకు అపార నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు.

 అన్నదాతకు తీవ్ర నష్టం
 కొలిమిగుండ్ల :  అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. మండల పరిధిలోని కోటపాడు, నందిపాడు, నాగిశెట్టిపల్లె, బి.ప్పులూరు తదితర గ్రామాల్లో కల్లాల్లో ఎండబోసిన మిరప కాయలు తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడి సిన కారణంగా మిరప కాయలు రంగు మారి ధర ఎక్కువగా పలకవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మండల పరిధిలో సాగు చేసిన ఉల్లి పంట పుప్పోడి కట్టే సమయంలో వర్షం రావడంతో నష్టం జరిగింది. అలాగే పెనుగాలి కారణంగా పెట్నికోటలోని రెండు నాపరాళ్ల పాలీష్ ప్యాక్టరీలకు చెందిన రేకుల షెడ్‌లు ఎగిరిపోయాయి. బెలుం సమీపంలో రెండు విద్యుత్ స్తంభాలు పడిపోగా కొలిమిగుండ్ల రామసుబ్బారెడ్డి ఆసుపత్రి ఆవరణలో రెండు వృక్షాలు నేలకూలాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement