జిల్లాలో భారీవర్షం | Sakshi
Sakshi News home page

జిల్లాలో భారీవర్షం

Published Sun, Sep 21 2014 3:06 AM

జిల్లాలో భారీవర్షం

  • పొంగుతున్న డ్రెయిన్లు
  •  వందలాది ఎకరాలు మునక
  •  పొంగి ప్రవహిస్తున్న మున్నేరు, వైరా, కట్టలేరు
  •  నందిగామ, వీరులపాడు మధ్య నిలిచిన రాకపోకలు
  •  జిల్లాలో 15.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు
  • మచిలీపట్నం : జిల్లా వ్యాప్తంగా శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్లు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మచిలీపట్నం, చల్లపల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లాలో వర్షాల కారణంగా వైరా, మున్నేరు, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాములూరు కూడలి వద్ద వైరా నది పొంగి ప్రవహిస్తుండటంతో నందిగామ-వీరులపాడు-ఖమ్మం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనాసాగరం వద్ద మరుగమ్మవాగు ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహంలోనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి వద్ద ఏనుగుగడ్డ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.
     
    పొంగి ప్రవహిస్తున్న డ్రెయిన్లు

    రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సముద్రతీరంలోని పంట పొలాల్లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది వేసవి నుంచి ప్రధాన డ్రెయిన్లలో పూడిక తీయలేదు. గుర్రపుడెక్క, నాచు, తూడులను తొలగించలేదు. డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా పనులు చేసేందుకు ఈ ఏడాది రూ.3.54 కోట్లతో టెండర్లు పిలిచారు. పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే కాంట్రాక్టర్లు పనులే ప్రారంభించకపోవటంతో ఆ ప్రభావం రైతుల పైనా పడుతోంది.

    గూడూరు, పెడన, బంటుమిల్లి మండలాల పరిధిలోని 65 వేల ఎకరాల ఆయకట్టులోని మురుగునీటిని సముద్రంలో కలిపే లజ్జబండ డ్రెయిన్‌కు కనీస మరమ్మతులు చేయలేదు. గూడూరు మండలంలోని శారదాయిపేట తదితర ప్రాంతాల్లో లజ్జబండ డ్రెయిన్‌లో గుర్రపుడెక్క మేట వేసుకుపోయింది. ఇటీవల పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు గూడూరు మండలంలో పర్యటించిన సమయంలో లజ్జబండ డ్రెయిన్‌లో గుర్రపుడెక్క, నాచు, తూడులను తొలగించటం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కాంట్రాక్టర్ లజ్జబండ డ్రెయిన్ ప్రారంభమయ్యే గూడూరు పీహెచ్‌సీ నుంచి 250 మీటర్లు మాత్రమే పనిచేసి నిలిపివేశారు.

    రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్‌లోకి భారీగా వర్షపునీరు చేరింది. నీటి ప్రవాహానికి గుర్రపుడెక్క అడ్డుగా ఉండటంతో నీరు దిగువకు వెళ్లక మండలంలోని జక్కంచర్ల, తరకటూరు, ముక్కొల్లు, ఆకులమన్నాడు, కోకనారాయణపాలెం, శారదాయిపేట తదితర ప్రాంతాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. ఆదివారం నాటికి వర్షపునీటి ప్రభావం మరింత పెరుగుతుందని, వర్షాలు కురిస్తే ఎక్కువ రోజులు నీటిలో ఉండి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పైరు పిలకలు తొడిగే దశలో ఉందని, ఈ దశలో పైరు నీటమునిగితే మొక్కలు చనిపోతాయని రైతులు చెబుతున్నారు.

    పెడన మండలంలోని వడ్లమన్నాడు డ్రెయిన్, కంచడం డ్రెయిన్, ఇసుకపర్ర డ్రెయిన్ పొంగి ప్రవహిస్తున్నాయి. మండల పరిధిలోని దక్షిణ తెలుగుపాలెం తదితర గ్రామాల్లో ఇటీవల వరినాట్లు పూర్తి చేసిన పొలాల్లో మోకాలులోతున నీరు నిల్వ ఉంది. గతంలో చేపల చెరువులు అధికంగా తవ్వటంతో వర్షపునీరు బయటకు వెళ్లడానికి ఆస్కారం లేకుండాపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
     
    బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో..

    బంటుమిల్లి మండలంలో పెదతుమ్మిడి, పెందుర్రు, కొమాళ్లపూడి, ఆముదాలపల్లి డ్రెయిన్లు ఉన్నాయి. ఈ డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చూసేందుకు పనులకు సంబంధించి టెండర్లు పిలిచి కాంట్రాక్టుదారులకు పనులు అప్పగించినా, ఇంత వరకు ప్రారంభించలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్లలో నిల్వ ఉన్న గుర్రపుడెక్క, తూడు, నాచు, జమ్ము, కిక్కిస నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి.

    ఈ డ్రెయిన్లలో ముందస్తుగానే పనులు చేసి ఉంటే ప్రస్తుతం తమ పొలాలు నీట మునిగేవి కావని రైతులు చెబుతున్నారు. కృత్తివెన్ను మండలంలో యండపల్లి, లక్ష్మీపురం, కృత్తివెన్ను డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. గత 20 సంవత్సరాలుగా ఈ డ్రెయిన్లకు కనీస మరమ్మతులు చేయకపోవటంతో కొద్దిపాటి వర్షానికే పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు వాపోతున్నారు.

    చెరుకుమిల్లి, పెందుర్రు, మునిపెడ, వాలంక, పీతలావ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల వరి పైరు నీటమునిగింది. చల్లపల్లి మండలంలో గుండేరు, జీలగలగండి, చిల్లలవాగు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా లక్ష్మీపురం, రామానగరం తదితర ప్రాంతాల్లో వరినాట్లు వేసిన పొలాలు నీటమునిగాయి అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, వాయుగుండం ఏర్పడి రోజుల తరబడి భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
     
    జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

    సముద్రం మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండటంతో శనివారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 15.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా విస్సన్నపేటలో 84.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గన్నవరంలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాట్రాయి-81.6 మిల్లీమీటర్లు, తిరువూరు-70.2, మచిలీపట్నం-47.6, ముసునూరు-35.2, పెడన-31.2, గూడూరు-23.0, నూజివీడు-24.2, వత్సవాయి-22.4, గుడ్లవల్లేరు-21.6, పెనుగంచిప్రోలు-19.8, విజయవాడ రూరల్, అర్బన్-17.0 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.

    బాపులపాడు-16.4, వీరులపాడు-16.2, పెదపారుపూడి-16.2, రెడ్డిగూడెం-15.8, మండవల్లి- 12.4, జగ్గయ్యపేట-11.8, ఉయ్యూరు-11.8, పెనమలూరు-8.8, ముదినేపల్లి-8.6, కృత్తివెన్ను-8.2, పామర్రు-8.6, చందర్లపాడు-7.6, గుడివాడ-7.4, మోపిదేవి-6.8, కలిదిండి-6.4, కంచికచర్ల-5.8, కైకలూరు-5.4, అవనిగడ్డ-5.2, మైలవరం-4.4, ఉంగుటూరు-4.2, నందివాడ-3.8, ఆగిరిపల్లి-3.4, బంటుమిల్లి-2.4, జి.కొండూరు-2.2, నాగాయలం-1.8, నందిగామ-1.2 మిల్లీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.
     

Advertisement
Advertisement