కుండపోత: పలుప్రాంతాలు అతలాకుతలం | Sakshi
Sakshi News home page

కుండపోత: పలుప్రాంతాలు అతలాకుతలం

Published Sun, Oct 27 2013 7:00 AM

Heavy Rains Lashes Khammam District

సాక్షి, కొత్తగూడెం: జిల్లాలోని పలు ప్రాంతాలు శనివారం కురిసిన వర్షానికి అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా మధిర, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో  కుండపోత కురిసింది.  వాగులు.. వంకలు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 50 గ్రామాలకు పైగా రాకపోకలు స్తంభించాయి. గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షం, శనివారం నాటి కుండపోత కారణంగా పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  రెండు లక్షల ఎకరాలకు పైగా పత్తిపై ఈ వర్షం ప్రభావం చూపింది. సుమారు 40 వేల ఎకరాల్లో వరి పనలు నీటమునగ్గా, 20 వేల ఎకరాల్లో మిర్చి నేలవాలింది. 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు రూ. 170 కోట్ల వరకు నష్టం ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఇల్లందు, పాలేరులలో వర్షం కురియడంతో పత్తిరైతుకు కోలుకోలేని దెబ్బతగిలింది. భారీ వర్షంతో ఏన్కూరు, జూలూరుపాడు, కొణిజర్లతోపాటు అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
 
 ఎర్రుపాలెం మండలంలో 15.7 సెం.మీ  వర్షం పడటంతో  జనజీవనం స్తంభించింది. కుండపోతతో పెద్ద గోపవరం గ్రామ సమీపంలోని హనుమంతుని బందంవాగు, జమలాపురం ఆర్చి వద్ద ఉన్న అలుగువాగులు పొంగాయి. రోడ్డుపై వరద ప్రవహించింది. మధిర-ఎర్రుపాలెం రోడ్డులో ఈ వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎర్రుపాలెంలోని అంబేద్కర్ సెంటర్‌లో లోతట్టులో నివాసముంటున్న పేదల ఇళ్లు వరదలో మునిగిపోయాయి. దీంతో  నిరుపేదలు కట్టుబట్టలతో మిగిలారు.  ఎర్రుపాలెంలోని రైల్వే ట్రాక్ వద్ద ప్రమాదం తప్పింది. సమీపంలోని చెరువు నుంచి అలుగు తీవ్రంగా పొంగడంతో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాద సూచికను దాటి వరద ప్రవహించింది. దీంతో రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొన్ని గంటల తర్వాత వరద ఉధృతి తగ్గడంతో ఊపిరిపీల్చుకున్నారు.  మండలంలోని పలు గ్రామాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. మధిర నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తు న్న వర్షాలతో 59 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. అలాగే మొక్కజొన్న 5,500 ఎకరాలు, వరి 5 వేల ఎకరాలు, ఇతర పంటలు 6 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. మధిర నియోజకవర్గవ్యాప్తంగా సుమారు రూ.60 కోట్ల వరకు నష్టం ఉంటుంది.
 
 దమ్మపేట మండలంలో జిల్లాలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షం పడటంతో మందలపల్లి సెంటర్‌లో రాష్ట్రీయ రహదారిపై ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు నాలుగు అడుగుల ఎత్తులో వరదనీరు పారింది. నల్లకుంటలో కోళ్లఫారంలో 6 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. 3 వేల ఎకారల్లో వరిపంట నీటమునిగింది. దమ్మపేట నుంచి చింతలపూడికి, పూచికుంట, నల్లకుంట , అల్లిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లిపల్లిలో సత్యనారాయణ కుంటకు గండిపడి గ్రామంలోకి వరదనీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి.
 
     అశ్వారావుపేట మండలంలో వాగొడ్డుగూడెం వాగు, అనంతారం వాగు, పెదవాగు, కోయరంగాపురం వాగు, మొద్దులగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అనంతారం, కంట్లం, ఖమ్మంపాడు, గుమ్మడవల్లి, నందిపాడు, కోయరంగాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుమ్మడవల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో అలుగు కాలువ ఉధృతంగా ప్రవహించి వేలేరుపాడు మండలానికి రాకపోకలు ఆగిపోయాయి. మండల వ్యాప్తంగా వెయ్యి ఎకరాల వరిచేలల్లో నీళ్లు చేరాయి. దాదాపు 350 ఎకరాల్లో వరిపనలు నేలవాలాయి. 100 ఎకరాల్లో మొక్కజొన్న, 2వేల ఎకరాల్లో పొగాకు నారు కొట్టుకుపోయింది. 3 వేలఎకరాల్లో పత్తి చేలు పూర్తిగా పూత కోల్పోయాయి. దాదాపు 500 ఎకరాల్లో సాగవుతున్న చిక్కుడు, కాకర పాదులు పూతరాలి నిరుపయోగంగా మారాయి. అశ్వారావుపేట పట్టణంలో ఇందిరాకాలనీలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. మద్దిరావమ్మ గుడి సెంటర్‌లో ఇల్లు కూలిపోయింది.
 
 కుక్కునూరు మండలంలో 4 వేల ఎకరాల్లో మిర్చి, వెయ్యి ఎకరాల్లో పత్తి, 300 ఎకరాలలో వరిపంటలు నీటమునిగాయి. పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయటం వల్ల వేలేరుపాడు మండలం గుళ్లవాయి, లచ్చిగూడెం, పాత పూచిరాల, బర్లమడుగు గ్రామాలకు చెందిన దాదాపు 3 వేల ఎకరాల్లో వరిపంట, దాదాపు 300 ఎకరాల్లో పత్తి చేలు నీటమునిగాయి. ముల్కలపల్లి మండలంలో 1500 ఎకరాల్లో పత్తి, 300 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. ఆరబెట్టిన మొక్కజొన్న కంకులు మొలకలు వచ్చాయి. చంద్రుగొండ మండలంలో 2 వేల ఎకరాల్లో వరి, 5వేల ఎకరాల్లో పత్తి నీటమునిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో వరి, 4 వేల ఎకరాల్లో మిర్చి, 3 వేల ఎకరాల్లో పొగాకు, 500 ఎకరాల్లో కూరగాయల పంటలు నీటమునిగాయి.
 
 భద్రాచలంలో డివిజన్‌లో వర్షం కారణంగా సుమారు 2వేల ఎకరాల్లో మిర్చి పంట నీట మునిగింది. వాజేడు, వెంకటాపురం మండలాల్లో వెయ్యి ఎకరాల్లో కోసిన వరి పనలు నీటిపాలయ్యాయి. భద్రాచలం మండలం గౌరిదేవిపేట, గన్నవరం ప్రాంతాల్లో మిర్చి తోటల్లో మూడడుగుల లోతు నీరు నిలిచింది. వెంకటాపురం, కూనవరం మండలాల్లో 500 ఎకరాల్లో మొక్కజొన్న పంట వర్షానికి పాడయింది. మరో 24 గంటలు వర్షపు నీరు చేలల్లో నిలిచి ఉంటే మిర్చి తోటలకు భారీగా నష్టం జరుగుతుంది.
 
 ఇల్లెందు నియోజకవర్గంలో మొక్కజొన్న విరిచి నూర్పిడి చేసిన రైతులు చేలల్లోనే ఆరబెట్టిన క్రమంలో  వర్షానికి తడిసి రంగుమారి, బూజుపట్టి మొలకెత్తుతోంది. ఇల్లందు మండల పరిధిలోని శేరిపురం, గోపాలపురం పంచాయితీల్లోని సుమారు 300 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదే విధంగా మండలంలో పత్తి చేలు ఊటలు పట్టాయి. పత్తిపంట చేతికొచ్చే దశలోనే ఈ వర్షాలు రైతులకు నష్టం చేస్తున్నాయి. మండలంలో సుమారు 150 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. టేకులపల్లి మండలంలో మిర్చి 100 ఎకరాలు, మొక్కజొన్న 100ఎకరాలు, వరి 100ఎకరాలు, పత్తి 500ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కామేపల్లి మండలంలో 4 వేల ఎకరాల్లో మిర్చి, 20 ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా, పత్తి తొలి కాత చెట్లమీదే ఉండటంతో వర్షానికి తడిసి కుళ్లిపోయింది. మిర్చి మళ్లల్లో నీరు నిలవడంతో మిర్చి చెట్లు ఎర్రబారుతున్నాయి.
 
 పినపాక నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి  అన్ని మండలాల్లో పత్తి, వరి, మొక్కజొన్న , మిర్చి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి. దీంతో కొన్ని మారు మూల గ్రామాలకు రవాణా సౌకర్యాలకు అంతరాయం కలిగింది. అశ్వాపురం, గుండాల మండలాల్లో మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి.


 కొత్తగూడెం నియోజకవర్గంలో శనివారం భారీ వర్షం కురియడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన ప్రగతినగర్, పాతకొత్తగూడెం, రామవరంలోని ఎస్‌సీబీ నగర్‌లో పంటలు నీటమునిగాయి. సింగభూపాలెం చెరువులోకి వరద నీరు చేరడంతో చెరువుకు అలుగుపడింది. దీంతో గోధుమవాగు  పొంగిపొర్లుతోంది. పాల్వంచ మండలంలోని సూరారం వద్ద ఉన్న బూడిదవాగు ఉదయం పొంగిపొర్లడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. కొత్తగూడెం మండలంలో 300 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. పాల్వంచ మండలంలో సుమారు 200 ఎకరాల మేరకు పత్తిపంటకు పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లింది.
 
 కిన్నెరసాని నది పొంగిపొర్లుతుండటంతో కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తివేసి నీటిని బయటకు వదిలారు. కొత్తగూడెం, చండ్రుగొండ మండలాల మద్య ఉన్న పెద్దవాగు పొంగి పెద్దవాగు బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని సింగరేణి ఓపెన్‌కాస్టులో వరద నీరు చేరడంతో సుమారు 30 వేల టన్నుల మేరకు ఉత్పత్తికి విఘాతం కలిగింది.  కొత్తగూడెం మండలంలోని బేతంపూడిలో పత్తిచేలో చేరిన వరదనీటిని చూసి తీవ్ర నష్టం జరిగిందనే ఆవేదనతో తేజావత్ రాజు అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. వర్షం కారణంగా కొత్తగూడెం పట్టణం, మండలంలో ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
 
 జూలూరుపాడు మండలంలో భారీ వర్షం పడటంతో తుమ్మలవాగు, పులుగుడువాగులు పొంగిపొర్లాయి. దీంతో భేతాళపాడు, నర్సాపురం, పులుగుడువాగుతండా, కొమ్ముగూడెం, రాజారావుపేటలకు రాకపోకలు స్తంభించాయి. ఏన్కూరు మండలంలో నిమ్మవాగు, కొణిజర్ల మండలంలో పగడేరు, రాళ్లవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పల్లిపాడు - ఏన్కూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement