క‘న్నీటి’ సుడులు | Sakshi
Sakshi News home page

క‘న్నీటి’ సుడులు

Published Sun, Oct 27 2013 3:04 AM

Heavy rains, still hundreds of villages under water

= ఇంకా జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు
 = నీటిలో నాని కూలిన వందలాది పూరిళ్లు
 = 3.61 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం
 = నష్టం అంచనాలపై సర్వే {పారంభించిన అధికారులు
 = నేటికీ నీటిలో నానుతున్న వరి, పత్తి ఇతర పంటలు
 = పెరుగుతున్న నల్లమడ, కొండవీటి వాగుల వరద ఉధృతి
 = ఉపాధి కోల్పోయిన చేనేత, మత్స్యకార కుటుంబాలు
 = జిల్లా వ్యాప్తంగా ఆర్ అండ్ బీ రోడ్లు కకావికలం
 = చిలకలూరిపేట వద్ద కుప్పగంజి వాగులో వృద్ధురాలు గల్లంతు
 
తెరిపిచ్చిన వర్షాలు.. కష్టాలు కన్నీళ్లనే మిగిల్చివెళ్లాయి. ఏ ఏటికాయేడు కడగండ్లను దాటుకుంటూ సేద్యం చేస్తున్న రైతుకు మళ్లీ స్వేదాన్నే మిగిల్చాయి. అల్పపీడనం, రుతుపవనాల దాడికి రైతులే కాదు జిల్లా యావత్తూ ‘జల’దరించింది. జబ్బు చేసిన వ్యవస్థలా అచేతనావస్థకు చేరింది. ఊళ్లల్లో నేటికీ క‘న్నీళ్లు’ సుడులు తిరుగుతుంటే కష్టాల కాష్టంలో ప్రజలు దుఃఖాన్ని దిగమింగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కట్టలు తెగిన డ్రెయిన్లు,కాలువల రూపంలో సాక్షాత్కరించి గ్రామాలు నీళ్లలో తేలియాడుతున్నాయి. ఎంత కష్టం..ఎంత నష్టం అని నిట్టూర్పు కంటే చేతనైన సాయంతో బాధితులకు తక్షణ ఓదార్పు అత్యవశ్యం. పర్యటనలు పరామర్శలతో కాలయాపన కన్నా సాయం ప్రకటించి ఆదుకుంటే బాధితులకు సాంత్వన చేకూరినట్టే... కుండపోత కష్టాలు నష్టాల నుంచి గుణపాఠాలు నేర్చి భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టగలిగితే  కడ‘గండ్ల’ నుంచి గట్టెక్కినట్టే..
 
సాక్షి, గుంటూరు: ఏటా జిల్లాకు వరద కష్టాలు తప్పటం లేదు. వీడకుండా ఐదు రోజలు కురిసిన కుండపోత వర్షాల ధాటికి జిల్లా వ్యాప్తంగా పలు పంటలకు భారీస్థాయిలో నష్టం వాటిల్లగా, రైతులు, చేనేత, మత్స్యకార, కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. జిల్లాలో శనివారం ఉదయం వరకు అత్యధికంగా పెదకూరపాడు మండలంలో 21.04 సెంటీమీటర్ల వర్షం పడగా, అత్యల్పంగా పిట్టలవానిపాలెం మండలంలో 0.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 15 మండలాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా  కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్ తేల్చరు. అన్ని రకాలుగా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న మండలాలుగా  బాపట్ల, కాకుమాను, పెదకూరపాడు, పెదనందిపాడు, చిలకలూరిపేటను గుర్తించారు. ఆయా చోట్ల లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటి ల్లగా, మేజర్ డ్రెయిన్లు, వాగులు పొంగిపొర్లడంతో ఆర్ అండ్ బీ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
 
పెదనందిపాడు, బాపట్ల, కాకుమాను మండ లాల్లోని పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మాచర్ల, నకరికల్లు, రొంపిచర్ల, పెదకూరపాడు మండలాల్లో కొన్ని చోట్ల పూరిగుడిసెలు నీటిలో నాని కూలిపోయాయి. చిలకలూరిపేట వద్ద కుప్పగంజివాగులో ఓ వృద్ధురాలు గల్లంతైంది. దీనావస్థలో రైతులు.. జిల్లా వ్యాప్తంగా భారీగా పంటనష్టం వాటిల్లింది. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం నుంచి అన్ని మండలాల్లో పంట నష్టంపై సర్వే ప్రారంభించారు. ప్రాథమిక అధికారిక అంచనా మేరకు మొత్తం 1,44,529 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. పత్తి 91,470 హెక్టార్లు, వరి 49,635, పొగాకు 1247, కంది 737, మొక్కజొన్న 382, వేరుశనగ 232 హెక్టార్లలో నష్టపోయినట్లు చెబుతున్నారు. వాస్తవాన్ని పరిశీలిస్తే ఈ నష్టం రెట్టింపు వుంటుందని భావిస్తున్నారు. బాపట్ల, పెదనందిపాడు మండలాల్లో నల్లమడ డ్రెయిన్ ముంపుతో వందలాది ఎకరాలు నీటమునిగాయి. డెల్టాలో మరో 20 రోజుల్లో చేతికొస్తుందనుకున్న వరి నీటిలో తేలాడుతుండటం రైతుల కళ్లల్లో నీళ్లుతిరుగుతున్నాయి. పల్నాడులో అధిక విస్తీర్ణంలో పత్తి  కాయ, పిందె, పూత రాలి నీటిలో నానుతుంది.
 
జల దిగ్బంధంలోనే గ్రామాలు... జిల్లాలో ప్రధానంగా కొండవీటి వాగు, నల్లమడ డ్రెయిన్ ముంపుతో ఐదు మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పెదకూరపాడు మండలం పాటిబండ్ల, లింగంగుంట్ల, పొడపాడు, జలాల్‌పురం,కంభంపాడు,పరస,బలుసుపాడు గ్రామాలు కొండవీటి వాగు ముంపునకు గురయ్యాయి.  అమరావతి మండలం లింగాపురం, అమరావతి, పెద్దమాద్దూరు, నరుకుళ్లపాడు, యండ్రా యి, వైకుంఠపురం గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. అమరావతి-గుంటూరు, అమరావతి-విజయవాడ రూట్లలో బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. క్రోసూరు మండలం బయ్యావరం, ఊటుకూరు, ఎర్రపాలెం, మునగొడు గ్రామాల్లో ఎద్దవాగు ప్రభావంతో పంటలు నీట మునిగాయి. గ్రామాల్లో 40కు పైగా గృహాలు కూలిపోయాయి. 
 
మరోవైపు నల్లమడ డ్రెయిన్ పొంగిపొర్లడంతో బాపట్ల, కాకుమాను మండలాల్లో అనేక చోట్ల గండ్లుపడి జిల్లెళ్లమూడి, అప్పికట్ల, జమ్ములపాలెం, మూలెపాలెం, అప్పాపురం, రేటూరు గ్రామా లకు నలువైపులా ఉన్న దారులన్నీ వరదనీటితో మూసుకుపోయాయి. ఆయా గ్రామాలకు రాత్రిళ్లు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో వారి ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. చిలకలూరిపేట పట్టణంలో సుమారు 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 
 
శాంతినగర్, వీరముష్టికాలనీ, సంజీవనగర్, బొందిలి పాలెం, జాగుపాలెం తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. పట్టణంలోని గడియారస్తంభం సమీపంలో ఉన్న 150 దుకాణాల్లో వరదనీరు చేరటంతో రూ. లక్షల్లో నష్టం సంభవించింది.  నాదెండ్ల మండలంలో అపార నష్టం సంభవించింది. బుక్కాపురం, కనపర్రు చెరువులకు గండ్లు పడ్డాయి. నిజాంపట్నంలో కుమ్మ రిరేవు ఉధృతంగా ప్రవహించడంతో శనివారం అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. నిజాంపట్నం నుంచి హార్బర్‌కు . బాపట్ల, పిట్టలవానిపాలెం వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు  పడవలను ఏర్పాటు చేసుకుని రేవు దాటుతున్నారు. మాచర్ల మండలంలో 28 గృహాలు, వెల్దుర్తిలో 20, దుర్గిలో మరో 20 పూరిగుడిసెలు కూలిపోయాయి. 
 
ఉపాధికోల్పోయిన నేతన్నలు.. 
రేపల్లె, భట్టిప్రోలు, చెరుకుపల్లి, ఐలవరం, కనగాల, గుళ్లపల్లి, పేటేరు తదితర గ్రామాల్లో చేనేత మగ్గాల గుంతల్లోకి వర్షపునీరు చేరడంతో నేత పనికి గండిపడింది. ఆయాచోట్ల సుమారు నాలుగువేల మంది నేత కార్మిక కుటుంబాలు ఉపాధిని కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నాయి. గుంతల్లో చేరిన నీటిని తోడి బయట పోసినా తిరిగి పని మొదలుపెట్టేందుకు పదిరోజులు పడుతుంది. అప్పటి వరకు  తప్పని దీన స్థితి.
 

Advertisement
Advertisement