జలదిగ్బంధం | Sakshi
Sakshi News home page

జలదిగ్బంధం

Published Wed, Dec 2 2015 1:39 AM

జలదిగ్బంధం

జిల్లా అంతటా భారీ వర్షాలు
కేవీబీపురంలో అత్యధిక వర్షపాతం నమోదు
పలు చెరువులకు గండ్లు నేలమట్టమైన ఇళ్లు
12వేల హెక్టార్లలో పంట నష్టం
నీటమునిగిన లోతట్టు గ్రామాలు  స్తంభించిన రాకపోకలు

 
చిత్తూరు (అగ్రికల్చర్): రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. జిల్లావ్యాప్తంగా 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా కేవీబీపురంలో 143.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చెరువులకు గండ్లుపడగా, లోతట్టు గ్రామాలు నీటమునిగి ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  జలశయాల గేట్లు ఎత్తివేయడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 12వేల హెక్టార్ల మేరకు ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. అరణియార్  ప్రాజెక్టులో నాలుగు గేట్లు, కృష్ణాపురం జలాశయంలో  రెండు గేట్లు, బహుదా ప్రాజెక్టులో రెండు గేట్లు, ఎన్టీఆర్ జలాశయంలో ఆరు గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో ఐదువేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. ముచ్చువోలు రోడ్డు దెబ్బతినడంతో  పోలవరం, చిట్టత్తూరు గ్రామాల మధ్య  రాకపోకలు స్తంభించిపోయాయి. కేవీబీపురం మండలంలో రాజులకండ్రిగ, ఎగువ పూడి రోడ్లు దెబ్బతినడంతో వడ్డిపాళెం, పోలినాయనికండ్రిగ, జయలక్ష్మీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలం పేరూరు చెరువు ప్రమాదస్థాయికి చేరుకుని నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతంలోని తారకరామ నగర్, హరిపురం కాలనీ, జనార్థన్ కాలనీలలో 250 ఇళ్ళు జలమయమవ్వగా, ఒక ఇల్లు కూలిపోయింది. పాకాల మండలంలో ఒక ఇల్లు నేలమట్టమయ్యింది. రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లె వద్ద వరి పంట పూర్తిగా నీట మునిగింది. రామచంద్రాపురం మండలం  రాయలచెరువు మొరవ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తిరుపతి, పచ్చికాపల్లం రోడ్డు జలమయమై వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.

పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం దివిటిగారిపల్లె అమ్మచెరువు, మొరంపల్లె కోనగుంట చెరువు, పేయనగారిపల్లె చెరువు, దామరగుంటచెరువులు కట్టలు లీకేజీ అవుతూ గండిపడే స్థితికి చేరుకుంది. బంగారుపాళెం మండలంలో టేకుమంద, తుంబపాళెం, శెట్టేరి, నల్లంగాడు, వెంకటాపురం, రామాపురం  చెరువుల కట్టలు లీకేజీ అవుతున్నాయి.  నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలంలోని శ్రీరంగం చెరువు మొరవ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వంద ఇళ్లు జలమయమయ్యాయి. నగరి మండలం బీమానగర్ చెరువు ఉధృతంగా మొరవ పోతుండడంతో నగరిపేట కాలనీలోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి.  వడమాలపేట మండలం చీమలవారివంక పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బైపాస్ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. వరి, చెరకు పంట వంద ఎకరాల మేరకు దెబ్బతింది. పుత్తూరు, మేషనూరు రోడ్డు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.చిత్తూరు నియోజకవర్గంలో గుడిపాల మండలంలో రాసనపల్లె గ్రామం చుట్టూ వరదనీరు చేరడంతో ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తు తం గ్రామసమీపంలోని రైల్వేట్రాక్‌పై నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

సత్యవేడు నియోజకవర్గంలో రాళ్లకాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడం తో సత్యవేడు, తొండంబట్టు, అంబికాపురం, నాగనందాపురం, ఎంజీ నగర్, సీఎస్.పురం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బాలకృష్ణాపు రం చెరువుకు తమిళనాడుకు చెందిన తెలుగు గంగ ద్వారా నీరు రావడంతో చెరువుకట్టకు గ్రామస్తులు గండికొట్టారు. పాములకాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వరదయ్యపాళానికి దారి పూర్తిగా మూసుకుపోయింది.  సంతవెల్లూరు రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి.
 
గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని కృష్ణాపురం జలాశయం నిండిపోవడంతో మూడు గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జలాశయంలో ఆరు గేట్లు ఎత్తివేసి రోజుకు 350 క్యూసెక్కల మేరకు  నీటిని విడుదల చేస్తున్నారు.  గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన చెరువు, కార్వేటినగరం మండలం కొత్తచెరువు, వెదురుకుప్పం మండలం కసవనూరు చెరువులకు గండిపడడంతో లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగాయి. వెదురుకుప్పంలో నాలుగు, పాలసముద్రం మండలంలో పది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎస్‌ఆర్‌పురం మండలంలో 17 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పెనుమూరు, వెదురుకుప్పం, గంగాధరనెల్లూరు మండలాల్లో  దాదాపు 200 హెక్టార్ల పంట దెబ్బతింది.
 

Advertisement
Advertisement