ముంచెత్తిన రావోను | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన రావోను

Published Fri, May 20 2016 5:43 AM

ముంచెత్తిన రావోను - Sakshi

‘రావోను’ ప్రభావంతో జిల్లా అంతటా భారీ వర్షాలు
ఈదురుగాలులకు కుప్పకూలిన    విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు
స్తంభించిన జనజీవనం
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఇంద్రకీలాద్రిపై ఘాట్‌రోడ్డు మూసివేత
మరో 24 గంటల పాటు భారీ వర్షాలు
జిల్లా అంతటా అప్రమత్తం
రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు

 

మచిలీపట్నం : జిల్లాను రావోను తుపాను గండం ఇంకా వీడలేదు. తుపాను ప్రస్తుతం మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో నైరుతీ దిశగా ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఒరిస్సా వైపు ప్రయాణిస్తోంది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. దీనికి తోడు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో మరో 24 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవటంతో జిల్లాలోని మామిడి, అరటి ఇతర ఉద్యానపంటలకు తీరని నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న మామిడి ఈదురుగాలుల ప్రభావంతో నేలరాలింది. వర్షం కారణంగా మామిడికాయలకు పురుగుపట్టే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

 
స్తంభించిన జనజీవనం

ఎడతెరిపి లేని వర్షాలు కురవటంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వేసవిలో వర్షం కురిసి కొంతమేర ఉపశమనం కలిగినప్పటికీ భారీ వర్షం కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు కాలువలను తలపించాయి. విజయవాడలోని మొగల్రాజపురం చండ్ర రాజేశ్వరరావుపేటలో కొండచరియ విరిగిపడడంతో భారీ బండరాయి మెట్లమార్గంలో నివాసగృహాల మధ్యకు దొర్లుకుంటూ వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు భీతావహులయ్యారు. తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి, వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఉదయం 8.30 వరకు జిల్లాలో 55 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 8.30 గంటల నుంచి 12 గంటల వరకు 23.7 మిల్లీమీటర్లు, 12 నుంచి 3 గంటల వరకు 5.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

 
జిల్లా అంతటా అప్రమత్తం

రావోను తుపాను మరో 24 గంటల పాటు జిల్లాపై ప్రభావం చూపనుండటంతో కలెక్టర్ బాబు.ఎ జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి 1077 టోల్ ఫ్రీ నంబరును కేటాయించారు. నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. నాగాయలంక మండలం ఊటగుండం, సొర్లగొంది, గుల్లలమోద గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రేషన్ షాపుల్లో నిత్యావసర సరకులను అందుబాటులో ఉంచామన్నారు. దీంతో పాటు సముద్రపు అలలు గ్రామాల్లోకి చొచ్చుకువస్తే ప్రజలను కాపాడేందుకు రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను జిల్లాకు రప్పించామన్నారు. ఒక బృందాన్ని అవనిగడ్డ, మరో బృందాన్ని మచిలీపట్నంలో ఉంచినట్లు చెప్పారు. ఈదురుగాలుల ప్రభావంతో అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయని, యుద్ధప్రాతిపదికన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  సముద్రతీరం వెంబడి ఉన్న మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించి వారిని మండల కేంద్రాల్లో ఉండేలా, వీఆర్వోలు, వీఆర్‌ఏల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి ఘాట్‌రోడ్డును ముందుజాగ్రత్తగా అధికారులు మూసివేశారు.

 

మామిడికి తీరని నష్టం

తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులతో పాటు వర్షం కురవటంతో మామిడికి తీవ్ర నష్టం ఏర్పడింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని 1200 ఎకరాల్లో మామిడిసాగు జరుగుతోంది.ప్రస్తుతం కోత దశలో ఉంది. తీరం వెంబడి పెనుగాలులు వీయటంతో మామిడికాయలు రాలిపోయాయి. తోట్లవల్లూరు, పెనమలూరు, కంకిపాడు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. కరకట్ట వెంబడి ఉన్న లంక గ్రామాల్లోని బీర, వంగ తోటలు ఈదురుగాలుల ప్రభావంతో  నేలకొరిగాయి.

 

Advertisement
Advertisement