హెలెన్ విలయం | Sakshi
Sakshi News home page

హెలెన్ విలయం

Published Sat, Nov 23 2013 4:47 AM

Helen storm has created  of mayhem

అమలాపురం, న్యూస్‌లైన్ :  జిల్లాలో హెలెన్ తుపాను అల్లకల్లోలం సృష్టించింది. పెనుగాలులు, భారీ వర్షం తీరప్రాంత మండలాలను అతలాకుతలం చేసింది. పచ్చని కోనసీమను చిన్నాభిన్నం చేసి1996 నాటి పెను విలయాన్ని గుర్తు చేసింది.  మరణమృదంగం  మోగించి ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. లక్షల ఎకరాల్లో పంటను కబళించింది. వేలాది కొబ్బరి చెట్లను, వందలాది విద్యుత్ స్తంభాలను  నేలకూల్చింది. సముద్రాన్ని తీరంపైకి ఉసిగొలిపి అలల అస్త్రాలతో ఛిద్రం చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులను నడికడలిలో బంధించి, వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది.

 బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను ఒంగోలు వద్ద  తీరం దాటుతుందని, జిల్లాపై పెద్దగా ప్రభావం ఉండదని జిల్లా యంత్రాంగంతోపాటు ప్రజలు కూడా ఆశించారు. అయితే చివరికి మచిలీపట్నం వద్ద తీరం దాటి, జిల్లాను చిగురాకులా వణికించింది. తీర ప్రాంత మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు విధ్వంసాన్ని సృష్టించాయి. గాలులకు వర్షం తోడై అపారంగా ఆస్తి నష్టాన్ని కలిగించింది. జిల్లాలో ఇళ్లు, చెట్లు కూలిన ఘటనలతో పాటు ప్రకృతి దాల్చిన వికృతరూపాన్ని చూసి తట్టుకోలేక గుండెలు ఆగి.. మొత్తం ఏడుగురు మరణించారు.

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని వాడపర్రు ఇందిరా కాలనీకి చెందిన ఎలిపే అంకాలు (35), అమలాపురం మండలం వన్నెచింతలపూడి స్తంభం గొయ్యికి చెందిన గుబ్బల శేషమ్మ (65), కొత్తపేట మండలం గంటికి చెందిన నక్కా లక్ష్మి (68), కాట్రేనికోన మండలం నడవపల్లికి చెందిన మల్లాడి వెంకాయమ్మ (65), దొంతుకుర్రుకు చెందిన తాడి కస్తూరి (75), ఐ.పోలవరం మండలం కొత్తమురమళ్లకు చెందిన  సవరపు సుబ్బారావు (60)లు మృత్యువాతపడ్డారు. ఉప్పాడ శివారు నాయకర్ కాలనీకి చెందిన కారే జగన్నాధం (35) వేటకు వెళ్లి కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో కానూరిమొగ వద్ద విద్యుత్ స్తంభం విరిగి మీద పడడంతో మరణించాడు.
 జిల్లాలో 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, అందులో 5931 మందికి ఆశ్రయం కల్పించినట్టు అధికారులు చెపుతున్నారు. తుపాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఐదారడుగుల ఎత్తున ఎగసిపడంతో పాటు తీరం పైకి చొచ్చుకు వచ్చాయి. ఈ కారణంగా ఉప్పాడ, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప, మగసాని తిప్ప, అల్లవరం మండలం బెండమూర్లంక, సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద తీరం కోతకు గురైంది. ఉప్పాడ వద్దఅలలు పది అడుగుల ఎత్తున విరుచుకుపడడంతో బీచ్ రోడ్డు మరోసారి ఛిద్రమైంది.
 పిడికిట ప్రాణాలతో..నడికడలిలో..
 జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేటకు వెళ్లిన 57 మంది మత్స్యకారులు తుపాను కల్లోలంతో సముద్రంలో చిక్కుకున్నారు. వారిలో కాకినాడ పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్య కారులు శుక్రవారం రాత్రి నిజాంపట్నం రేవు వద్ద, పెరుమాళ్లపురానికి చెందిన 13 మంది ఓడలరేవు వద్ద తీరానికి చేరుకున్నారు. మిగిలిన 38 మంది నడికడలిలో చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.  కాకినాడ సూర్యారావుపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు మామిడికుదురు మండలం కరవాక వద్ద, కాకినాడ ఏటిమొగ, కొండబాబు కాలనీ, ఆటోనగర్‌లతో పాటు ఉప్పలంకకు చెందిన మరో 31 మంది నరసాపురం వద్ద సముద్రంలో చిక్కుకున్నట్టు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారిని తీరానికి చేర్చేందుకు కోస్టుగార్డు, మెరైన్ పోలీసులు, విశాఖపట్నం నుంచి ప్రత్యేక కోస్టు గార్డు గస్తీఓడతో పాటు హెలికాప్టర్ సాయంతో ప్రయ వారిని తీరానికి చేర్చేందుకు కోస్టుగార్డు, మెరైన్ పోలీసులు, విశాఖపట్నం నుంచి ప్రత్యేక కోస్టు గార్డు గస్తీఓడతో పాటు హెలికాప్టర్ సాయంతో ప్రయత్నిస్తున్నారు.

 ఈదురుగాలులకు తీరాన్ని ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పూరిపాకలు నేలకూలాయి. కోనసీమలోని మిగిలిన మండలాల్లో సైతం వందలాది ఇల్లు, పశువులపాకలు నేలమట్టమయ్యాయి. కాట్రేనికోన మండలంలో తుపాను ప్రభావం అధికంగా చూపింది. మగసాని తిప్ప వద్ద సముద్రం చొచ్చుకురావడంతో మత్స్యకారులు భయాందోళనలకు గురయ్యారు. పల్లం, బలుసుతిప్ప వద్ద పడవలు బోల్తా కొట్టి నీటమునిగాయి. జిల్లాలో 179 పూరిళ్లు, 4 పక్కా ఇళ్లు దెబ్బతిన్నట్టు అధికారులు చెపుతున్నా.. వాస్తవానికి ఆ సంఖ్య మరిన్ని రెట్లు ఉంటుందని అంచనా.

Advertisement

తప్పక చదవండి

Advertisement