కోడి పందేలను అనుమతించం | Sakshi
Sakshi News home page

కోడి పందేలను అనుమతించం

Published Wed, Jan 6 2016 2:54 AM

కోడి పందేలను అనుమతించం - Sakshi

    ► ఎస్పీలకిచ్చిన ఆదేశాలు ఈ ఏడాదీ అమలవుతాయి
    ► హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్: కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతిచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఎవరైనా చట్ట నిబంధనలను ఉల్లంఘించి కోడి పం దేలను నిర్వహించినా, జూదమాడినా చర్యలు తీసుకోవాలని గతంలో ఆయా జిల్లాల ఎస్పీల కు ఆదేశాలు జారీ చేశామని, వాటిని ఈ ఏడా దీ అమలు చేస్తామని తెలిపింది. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ అదే జిల్లాకు చెందిన నరహరి జగదీశ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారించంది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.


అనుమతివ్వాలని పిటిషన్..
కోడి పందేల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ప్రధాన వ్యాజ్యంతోపాటు ఇంప్లీడ్ పిటిషన్‌పైనా ధర్మాసనం విచారించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement