వివాదంగా మారిన కోడి పందేలు | Sakshi
Sakshi News home page

వివాదంగా మారిన కోడి పందేలు

Published Tue, Jan 6 2015 1:46 AM

వివాదంగా మారిన  కోడి పందేలు - Sakshi

ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కోర్టు ధిక్కార కేసుకు సన్నాహాలు
ప్రేక్షకపాత్రలో పోలీసులు

 
పెనమలూరు : తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. పోరంకిలోని తన కార్యాలయం ఆవరణలో ఆదివారం కోడి పందేలు నిర్వహించి, తాను సంస్కృతిని కాపాడానని ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యే హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు కోర్టు ధిక్కార కేసు వేసేందుకు పలువురు సన్నాహాలు చేస్తున్నారు. కోడి పందేలు చట్టవిరుద్ధమని, ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోడి పందేలు నిర్వహించటం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కోడి పందేలు వేయడాన్ని జంతు, పక్షి సంరక్షణకు చెందిన పలువురు కోర్టులో సవాల్ చేయనున్నారు. కోర్టు పిటీషన్ స్వీకరిస్తే ఎమ్మెల్యే కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

పోలీసుల తీరుపై విమర్శలు

రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు వేస్తున్న సామాన్యులపై పోలీసులు దాడిచేయడం పరిపాటిగా మారింది. కొన్నిచోట్ల పోలీసులు దాడిచేయడంతో కొందరు చెరువులు, వాగులను దాటి అవతలి ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. పోరంకిలో మాత్రం పలువురు పోలీసులు, ఎస్‌ఐల కళ్లముందే కోడి పందేలు ఎమ్మెల్యే నిర్వహించారు. అయినప్పటికీ కోడి పందేల నిర్వహణ గురించి సీఐ మురళీకృష్ణ వద్ద ప్రస్తావించగా తనకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని ఆయన చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement
Advertisement