విదేశీ అనుభవం వెనుక హేతుబద్ధత ఏమిటి...? | Sakshi
Sakshi News home page

విదేశీ అనుభవం వెనుక హేతుబద్ధత ఏమిటి...?

Published Fri, Oct 14 2016 1:52 AM

విదేశీ అనుభవం వెనుక హేతుబద్ధత ఏమిటి...? - Sakshi

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం
 తదుపరి విచారణ  సోమవారానికి వాయిదా

 
 సాక్షి, హైదరాబాద్: ‘రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకునే కంపెనీలకు తప్పనిసరిగా విదేశీ అనుభవముండాలన్న నిబంధనలు విధించడం వెనుకున్న హేతుబద్ధత ఏమిటి? హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీల అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది దేశీయ కంపెనీలే కదా? ఆ పనులను ఆ కంపెనీలు ఆషామాషీగా చేయలేదు? అలాంటిది దేశీయ కంపెనీలకు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్య అవకాశం కల్పించకపోవడంలో హేతుబద్ధత ఏమిటి?’ అని హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
  అదే విధంగా విదేశీ కంపెనీని జాయింట్ వెంచర్ (జేవీ)గా ఎంపిక చేసుకుని, బిడ్ దాఖలు చేసేందుకు 45 రోజుల గడువు సరిపోతుందా? అని కూడా ప్రభుత్వాన్ని అడిగింది. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్‌ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్‌లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గత నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
 
 ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సీఆర్‌డీఏలు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారణ జరిపింది. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
 
  రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి దురుద్దేశాలున్నట్లు సింగిల్ జడ్జి తన తీర్పులో ఎక్కడా చెప్పలేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయడమే కాక, అంతే వేగంగా మార్కెటింగ్ ప్రక్రియనూ పూర్తి చేసే సామర్థ్యం కంపెనీలకు ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అందుకే విదేశీ అనుభవాన్ని ఓ నిబంధనగా పెట్టామని చెప్పారు.
 

Advertisement
Advertisement